బళ్లారిఅర్బన్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బళ్లారి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కర్ణాటక రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయవాదుల సంఘాలు ఐక్యంగా ఈ నిరసనలో పాల్గొన్నాయి. న్యాయవాదులపై దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి, వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక రాష్ట్ర న్యాయవాదుల పరిరక్షణ చట్టానికి తగిన సవరణలు చేసి, మరింత పటిష్టంగా చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు. రాష్ట్రంలోని న్యాయవాదులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని, దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిరసనకారులు విజ్ఞప్తి చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రామబ్రహ్మం, ఉపాధ్యక్షుడు కేఈ.యశోదమూర్తి, కార్యదర్శి ఎస్.అన్సర్ బాషా, సంయుక్త కార్యదర్శి ఎస్.ఎర్రెమ్మ, కోశాధికారి కేజీ.బసవరాజ్, కార్యవర్గ సభ్యులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
విజయనగరలో బైక్ ర్యాలీ
హొసపేటె: న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యలను తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులు తమ నిరసన గళాన్ని వీధుల్లో వినిపించారు. విధులను బహిష్కరించి రోడ్డెక్కిన న్యాయవాదులు ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తూ మంగళవారం హొసపేటెలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హొసపేటె నగరంలోని కోర్టు ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నగరంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగుతూ జిల్లాధికారి కార్యాలయం వరకు చేరుకుంది. బెంగళూరులో న్యాయవాది హత్య, గౌరిబిదనూరు న్యాయవాదిపై జరిగిన దాడి ఘటనలను నిరసిస్తూ న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులకు తగిన భద్రత కల్పించాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, హత్యకు గురైన న్యాయవాది కుటుంబానికి ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని ఒత్తిడి చేశారు. బార్ అసోసియేషన్ నేతలు, కార్యకర్తలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
రాయచూరులో...
రాయచూరు రూరల్: బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో న్యాయవాది మంజునాథ్, అన్నపూర్ణేశ్వరి, శ్రీరామ్‌లపై హత్యలు, గౌరిబిదనూరులో వెంకట రమణపై దాడులు చేయడం తగదని రాయచూరు జిల్లా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడారు. న్యాయ వాదుల రక్షణకు సర్కార్ చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివప్పకు వినతిపత్రం సమర్పించారు.
నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
రక్షణ చట్టానికి సవరణలు చేయండి
బళ్లారి బార్ అసోసియేషన్ డిమాండ్


