సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుభవార్త చెప్పారు. ఇళ్లు లేని 5 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా ధర్మపుర గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలం ఉందో గుర్తించి అక్కడ ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను అందించి ఆదుకుంటామన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేటు భూములను సైతం కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. ప్రజలకు ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాసేవ కార్యక్రమం ద్వారా నేరుగా అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరవేస్తామన్నారు. రైతులు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. దేశంలో నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య ప్రజల ఆదాయాలు మాత్రం తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు మెరుగైన జీవిత విధానాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల ప్రయోజనాలు కోసం విద్యుత్ శాఖ ద్వారా ఉచిత పంపుసెట్లు అందించే విద్యుత్ శక్తి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కరువు పరిస్థితులను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నేను చేతల వ్యక్తిని– సీఎం
తాను అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదని, ఇచ్చిన మాట ప్రకారం నడుచుకునే వ్యక్తిని అని సీఎం డీకే శివకుమార్ అన్నారు. మంగళవారం ఆయన హిరియూరులో విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లోను తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలను సమర్ధవంతంగా అమలు చేస్తోందన్నారు. గతంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి సాధించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి 126 సీట్లు ఇచ్చారన్నారు. మళ్లీ అంతకన్నా ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రఘుమూర్తి మాట్లాడుతూ సీఎం నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది 5 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ
చిత్రదుర్గ జిల్లా హిరియూరులో సీఎం డీకే శివకుమార్


