హొసపేటె: మతసామరస్యం, మానవత్వం, సోదరభావానికి ప్రతీకగా నిలిచిన మానవతావాది మరణంతో గ్రామమంతా కన్నీటి పర్యంతమైంది. ముస్లిం కుటుంబంలో జన్మించినా హిందూ సంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కులమతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి జీవించిన అద్దిగేరి గౌస్‌సాబ్‌కు గ్రామస్తులు భావోద్వేగ వీడ్కోలు పలికారు. విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా వరదాపుర గ్రామానికి చెందిన 68 ఏళ్ల గౌస్‌బాస్‌కు ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గుండెపోటుతో గౌస్‌సాబ్ మృతి చెందడంతో గ్రామం విషాదఛాయలు అలముకున్నాయి. గౌస్‌సాబ్ కేవలం ఒక వ్యక్తిగా కాకుండా గ్రామంలో ఐక్యతకు, సోదరభావానికి ప్రతీకగా నిలిచారు. ముస్లిం అయినప్పటికీ హిందూ సమాజంలోని ప్రతి ఆచారాన్ని తన సొంత కుటుంబ వేడుకగా భావించేవారు. గ్రామంలో ఏ కులానికి చెందిన వ్యక్తి మరణించినా ముందుండి అంత్యక్రియల్లో సహకరించేవారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తూ రాత్రంతా వారి ఇంటి వద్దనే ఉండి భజనలు పాడుతూ, దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పేవారు. గుడి అయినా మసీదు అయినా పండుగైనా, శుభకార్యమైనా అందరి కార్యక్రమాల్లో తన వంతు సేవ అందించేవారు. కులమతాల అడ్డుగోడలను చెరిపేస్తూ ప్రతి ఒక్కరితో అప్యాయంగా మెలిగిన గౌస్‌సాబ్ గ్రామ ప్రజలందరి అభిమానాన్ని, నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఆయన అంతిమయాత్రలో గ్రామమంతా పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికింది.


