బళ్లారిటౌన్: జిల్లా రాజ్యోత్సవంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన సాధకులకు సన్మానంలో సీనియర్ కళాకారులను గుర్తించకుండా అన్యాయం చేశారని సీనియర్ కళాకారుల సంఘం అధ్యక్షుడు పీఎల్ గాదిలింగనగౌడ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా స్థాయిలో వివిధ రంగాల్లో సేవలు అందించిన సాధకులను గుర్తించి జిల్లా యంత్రాంగం సన్మానించడం శ్లాఘనీయం అని, అయితే రంగస్థలంలో అర్హులైన సీనియర్ సాధకులను గుర్తించక పోవడంతో తీవ్రంగా కలత చెందుతున్నారన్నారు. పక్క జిల్లా అయిన విజయనగరలో పత్రికల ద్వారా దరఖాస్తులను పిలిచి అర్హులైన వారిని ఎంపిక చేసి సన్మానించారన్నారు. బళ్లారి జిల్లాలో ఎలాంటి దరఖాస్తులు కోరలేదన్నారు. అంతా ఎంపిక సమితి సభ్యుల సూచన మేరకే ఎన్నికలు చేసినందున అర్హులైన సీనియర్ వయో వృద్ధ సాధకులకు అన్యాయం జరిగిందన్నారు. అన్ని రంగాల్లో కూడా ముందస్తుగా తెలియజేసి దరఖాస్తు కోరడం వల్ల అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. జిల్లాలో వివిధ జిల్లాల కళాకారులు, 50 నుంచి 60 ఏళ్ల పాటు కళా సేవలు అందించిన 80 ఏళ్ల వయో వృద్ధులు కూడా ఉన్నారని, కన్నడ సంస్కృతిక శాఖ ఎంపికలో సరైన బాధ్యత తీసుకోక పోవడంతో ఇలా అన్యాయం జరిగిందన్నారు. నేతలు చంద్రమౌళి, చంద్రశేఖర్, గోవిందనాయక్, జగదీశ, కుబేర, జగదీశ్ స్వామి, ఉత్తనూరు రామన్న, విశ్వనాథ్ హుగార తదితరులు పాల్గొన్నారు.


