శివాజీనగర: సువర్ణసౌధలో చెరకు రైతుల సమావేశంలో రైతు సంఘాల మధ్య గొడవలు జరిగాయి. చూనప్ప పూజారి వర్గానికి, కోడిహళ్లి చంద్రశేఖర్ వర్గానికి చెందిన రైతులు పోట్లాటకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సౌధ లోపలకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రైతు నాయకులు, రైతులు చేరుకున్నారు. సీఎం రాక ముందే, నాయకులు ప్రసంగించసాగారు. ఓ వర్గం నేతల డిమాండ్లు సరికాదని మరో వర్గం మైకులు లాక్కుని రభసకు పాల్పడింది. చూనప్ప పూజారి జోక్యం చేసుకుని, అందరినీ శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. టన్ను చెరకుకు రూ.5,500 కావాలని నినాదాలు చేయసాగారు. కొందరు గాజు గ్లాసులు విసిరినట్లు సమాచారం. ఎమ్మెల్యే దర్శన్ పుట్టన్నయ్య, రైతు నాయకుడు చుక్కీ నంజుండస్వామి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ శాంతించలేదు. చివరకు పోలీసులు కొందరిని బయటకు తీసుకెళ్లారు.


