దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలూకా గోపనహళ్లిలో ప్రాచీన కాలం నాటి నాణేలు లభించాయి. చనిపోయిన తాబేలును పూడ్చడానికి గ్రామంలోని పిల్లలు రంగమ్మ అనే మహిళ ఇంటి ముందు గుంత తవ్వుతుండగా ప్రాచీన నాణేలు గల మట్టి కుండ లభించింది. తహసీల్దార్ రహెనా బాషా చేరుకుని నాణేలను పరిశీలించారు. పురావస్తుశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మట్టి కుండ నాణేలను వారు స్వాధీనం చేసుకున్నారు. పురాతన రాగి నాణేలని తెలిసింది.
సైకో ప్రేమ వేధింపులకు బాలిక బలి
మైసూరు: జిల్లాలోని నంజనగూడులో నీలకంఠ నగరలో సైకో వేధింపులకు పీయూసీ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. విద్యార్థిని (17)ని ప్రేమించాలంటూ స్థానికుడు అశోక (25) వెంటపడి వేధించేవాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పగా, వారు పోకిరీని మందలించినా అతనిలో మార్పు రాలేదు. తనను ప్రేమించమని, లేకపోతే చంపేస్తానని బెదిరించసాగాడు. ఫోన్ చేసి, మెసేజ్‌లు కూడా పంపేవాడు. తీవ్ర కలవరానికి గురైన బాలిక ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సైకోపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
4 ఎమ్మెల్సీ సీట్లు ఎవరికో?
● నేడు ఓట్ల లెక్కింపు
శివాజీనగర: అధికార కాంగ్రెస్, బీజేపీ–జేడీఎస్ కూటమి మధ్య తీవ్ర పోటీ సాగిన 4 బెంగళూరు ఉపాధ్యాయులు, ఈశాన్య ఉపాధ్యాయులు, పశ్చిమ, ఆగ్నేయ పట్టభద్రుల ఎమ్మెలీస్థానాల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. సాయంత్రానికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. ఫలితాల కోసం అన్ని పార్టీలు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. నాలుగింటా ప్రధాన పార్టీలతో సహా 43 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టాత్మకంగా పోరు సాగింది. ఈ ఎన్నికల్లో విజయం లభించిన పార్టీ.. ప్రజల మద్దతు తమకే ఉందని, ఇక ఎదురులేదని ప్రకటించుకోనుంది. బెంగళూరు ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఓట్ల లెక్కింపు సిటీలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో జరుగుతుంది. ఇక్కడ 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమ గ్రాడ్యుయేట్‌లో 75, ఆగ్నేయ గ్రాడ్యుయేట్‌లో 73 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ ఆఫీసు తెలిపింది. ఫలితాలపై పెద్దమొత్తాల్లో పందేలు కూడా సాగినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ గాలి: విజయేంద్ర
బనశంకరి: రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని, 115 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని ఓ సర్వే తెలిపిందని బీజేపీ రాష్ట్రాద్యక్షుడు బీవై.విజయేంద్ర అన్నారు. బెంగళూరులో పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి టీపీ, జడ్పీ ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేదన్నారు. కావాలనే రిజర్వేషన్లలో గందరగోళం సృష్టించి కోర్టు ద్వారా స్టే తీసుకువచ్చే కుట్ర జరుగుతోందన్నారు. తీవ్ర కరువు సమయంలో కావేరి పరివాహక ప్రాంత రైతుల హితాసక్తి కాపాడలేకపోయిందన్నారు. సుప్రీంకోర్టు, కావేరి ట్రిబ్యునల్ ముందు పరిస్థితిని సరిగా వివరించలేదని సర్కారును తప్పుబట్టారు. ప్రధాని మోదీపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు.


