గండసి గణపతికి బైబై | - | Sakshi
Sakshi News home page

గండసి గణపతికి బైబై

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

బొమ్మనహళ్లి: హాసన్‌ జిల్లాలోని గండసిలోని ప్రత్యక్ష గణపతి 76వ ప్రతిష్టాపన, నిమజ్జనోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. సాయంత్రం నుంచి నిమజ్జన ఊరేగింపు ఆరంభమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా భారీ ఊరేగింపును కుదించారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. గండసి దొడ్డకెరెలో స్వామిని నిమజ్జనం చేశారు. తరువాత భారీఎత్తున టపాసులను పేల్చారు.

నేత్రపర్వంగా కళ్యాణం

బొమ్మనహళ్లి: బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్‌లోని రాణి అబ్బక్క మైదానంలో శ్రీనివాస కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అలాగే శ్రీనివాసరథోత్సవం ఘనంగా సాగింది. లేఔట్‌తో పాటు పలు ప్రాంతాల్లో రథయాత్ర సాగింది. టీటీడీ నుంచి వచ్చిన అర్చకులు పూజలు నిర్వర్తించారు. ఎమ్మెల్యే హెచ్‌.డి. రంగనాథ్‌, ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి తదితరులు పాల్గొన్నారు.

పెరుగు ప్యాకెట్‌ కోసం రూ.98 వేలు ఔట్‌

యశవంతపుర: రూ.50తో కొన్న పెరుగు పాకెట్‌కు రీఫండ్‌ కావాలని ప్రయత్నించిన మహిళ రూ.98 వేలను పోగొట్టుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. వసంతనగర ప్యాలెస్‌ క్రాస్‌ రోడ్డులో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మహిళ ఈ నెల 17న బ్లింకిట్‌లో పెరుగు పాకెట్‌ను బుక్‌ చేసింది. వచ్చిన ప్యాకెట్‌ లీకేజీ కావడంతో డెలివరీ ఏజెంట్‌కు ఫిర్యాదు చేయగా, తమ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలని సూచించారు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ను వెతికి ఫోన్‌ చేసింది. ఫోన్‌ స్వీకరించిన వ్యక్తి డబ్బులు రీఫండ్‌ చేస్తామంటూ ఓ లింక్‌ను ఆమె వాట్సాప్‌కు పంపించాడు. ఆమె ఆ లింక్‌ను నొక్కి బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసింది. కొంతసేపటికే ఆమె అకౌంట్‌లోని రూ.98 వేలను వంచకులు విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆలయ బసవన్న

జన్మదిన వేడుకలు

మండ్య: జిల్లాలోని హలగూరు దగ్గర అగసనపుర గ్రామంలో బసవేశ్వరస్వామి ఆలయ వృషభం 10 పుట్టినరోజు ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని బసవన్న దర్శనం చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి బసవేశ్వరస్వామికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజ, మహామంగళారతి నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం గావించారు.

అమ్మవారికి

గాజుల సింగారం

బనశంకరి: బెంగళూరులో బనశంకరీదేవి ఆలయంలో అమ్మవారిని గాజుల అలంకరణలో ముస్తాబు చేశారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవ తరువాత అర్చకులు ఏ.చంద్రమోహన్‌ దేవి మూలవిరాట్‌కు అభిషేకం, అర్చనలు నిర్వహించి గాజులతో అలంకరించారు. పెద్దసంఖ్యలో మహిళా భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement