మైసూరు: మైసూరులోని ప్రపంచ ప్రసిద్ధ అంబావిలాస్ ప్యాలెస్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది, ప్యాలెస్‌లోని చాలా భూమి ప్రభుత్వానిదే. కానీ మేము రాజకుటుంబం నివాసం కోసం కొంత భూమిని ఇచ్చాము అని జిల్లా మంత్రి యతీంద్ర చెప్పారు. దసరా ఉత్సవాలలో అనేక లోపాలు జరిగాయని రాజమాత ప్రమోదాదేవి ప్రకటించడంపై ఆయన సోమవారం మాట్లాడుతూ.. ఆమె చేసిన సూచనలన్నింటినీ ప్రభుత్వం వినబోదు అని స్పష్టంచేశారు. బంగారు అంబారీ పూర్తిగా ప్యాలెస్ ఆస్తి, దానిని దసరా సమయంలో డబ్బు చెల్లించి తీసుకుంటాము. మేము రాజకుటుంబానికి తగిన గౌరవం ఇస్తూ, వారి సహకారం తీసుకుని దసరా నిర్వహిస్తున్నాము. ఆమెతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని యతీంద్ర తెలిపారు. ఆమె లేఖకు సర్కారు సమాధానం ఇస్తుందన్నారు. ప్రతి ఏటా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు వేలాదిగా గుమిగూడినప్పుడు మనం ఏం చేయగలం? అని ఆయన అన్నారు.
మంత్రి యతీంద్ర
దసరా వేడుకలపై రాద్ధాంతం..
అంబారీని వదులుకోబోం
రాబోయే రోజుల్లో అంబారీని గానీ, రాజభవన ప్రాంగణాన్ని గానీ వదులుకోబోమని, వాటిని బహిష్కరిస్తామనడం అవాస్తవమని తెలిపారు. ఏవైనా గందరగోళం ఉంటే సీఎం వారితో మాట్లాడతారు, వారు అంబారీని ఇవ్వం అంటే మేము కోర్టుకు వెళతాము అని మంత్రి అన్నారు. పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి సిద్ధమన్నారు. దీనిపై పోలీస్ కమిషనర్‌తో మాట్లాతామన్నారు. దసరా ఉత్సవాలను 7 రోజులకు కుదించడం జరగదన్నారు.


