చింతామణి: ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ దంపతులను కారు ఛిద్రం చేసింది. ఈ విషాద సంఘటన చింతామణి రూరల్ పోలీసు స్టేషన్ పరిదిలోని బైపాస్‌లో సంతేబిర్యాని దగ్గర ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. షణ్ముగ (27), మిథుల (23), చింతామణి పట్టణం ఎన్‌ఆర్ బడావణెలో నివాసముంటారు. 4 నెలల కిందట మదనపల్లికి చెందిన సునీల్– అనిత దంపతులు తమ కుమార్తె మిథులను షణ్ముగతో పెళ్లి చేశారు. స్థానికంగా బంగారు షాపు నిర్వహించేవాడు.
టీ తాగాలని వెళ్తుండగా..
కాలక్షేపం కోసం రాత్రి 8 – 9 గంటల సమయంలో బెంగళూరు రోడ్డులోని చిన్నసంద్ర గ్రామానికి టీ తాగడానికి స్కూటర్‌లో ఇద్దరూ బయల్దేరారు. ఎదురుగా వచ్చిన ఎకో కారు వారిని వేగంగా ఢీకొనింది. దీంతో షణ్ముగ, మిథులు దూరంగా పడిపోయి గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. స్కూటర్ నుజ్జు నుజ్జుయింది. కారు రోడ్డు పక్కకు పల్టీలు కొట్టగా సూరజ్, అతుల్ అనే ఇద్దరు గాయపడ్డారు. చింతామణి వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరుకు తరలించారు. వీరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. షణ్ముగ బంధువులు పరుగున వచ్చి విలపించారు.
స్కూటర్‌ను ఢీకొన్న కారు
దంపతుల దుర్మరణం
చింతామణి వద్ద విషాద ఘటన


