శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తోన్న స్టింగ్ ఆపరేషన్ వివాదం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసేందుకు సమయం కోరారు. ఇటీవల రాజకీయ పరిణామాలు, తమపై జరుగుతున్న అంశాలపై ఆయన హైకమాండ్‌తో చర్చించే అవకాశముంది. సిద్దరామయ్య నవంబర్ 1న ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే నిరసనల్లో పాల్గొంటారు. మరుసటి రోజు అంటే 2న రాహుల్‌గాంధీతో సమావేశమవుతారు. ఇందుకోసం అపాయింట్‌మెంట్‌ను కోరినట్లు తెలిసింది. రాహుల్‌గాంధీ భేటీకి అనుమతించవచ్చని తెలుస్తోంది.
సిద్దులో అంతర్మథనం
ప్రస్తుతం రాష్ట్ర, జాతీయస్థాయి వార్తల్లో నలుగుతున్న స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో తన పేరు రావడం సిద్దరామయ్యకు తీవ్ర ఇబ్బందిని, అసహనాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఘనతను, అత్యధిక బడ్జెట్లను సమర్పించిన కీర్తిని సంపాదించుకున్న ఆయన స్టింగ్ గొడవ ప్రతిష్టగా మచ్చగా బాధపడుతున్నారు. తాను అధికారం వీడగానే పేరు ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని సిద్దు ఆరోపణలు కూడా చేశారు. ఈ కుట్ర వెనుక కొందరు కావలసినవారే ఉండవచ్చని ఆయన అనుమానిస్తున్నారు. దీని వెనుక ఉన్నవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం గురించి సన్నిహితులతో ఆవేదన చెందారని ప్రచారం సాగుతోంది.
ఏమేం చర్చిస్తారు?
రాహుల్‌గాంధీతో జరిగే సమావేశంలో, సిద్దరామయ్య స్టింగ్ ఆపరేషన్‌తో పాటు, మైసూరు దసరా వేడుకలలో జరిగిన సంఘటనలు, తన కుమారుడు యతీంద్రకు అప్పగించిన బాధ్యతలతో సహా రాష్ట్ర కాంగ్రెస్‌లోని అంతర్గత సమస్యలను చర్చించి పరిష్కారానికి విన్నవించే అవకాశముందని ఆయన సన్నిహితుల సమాచారం. ఢిల్లీ పంచాయతీతోనైనా స్టింగ్ రగడ సద్దుమణిగేనా, లేక మరింత ముదిరేనా? అనేది సస్పెన్స్‌గానే ఉంది.
రాహుల్‌గాంధీతో సిద్దరామయ్య (ఫైల్)
స్టింగ్ రగడ ఊహించని మలుపులు
● కేంద్రమంత్రి కుమారస్వామి ఆరోపణలు
శివాజీనగర: మాజీ ప్రధాని హెచ్.డీ.దేవెగౌడ కుటుంబాన్ని హతమార్చేందుకు కుట్ర పన్నారని ఆయన కుమారుడు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక కుటుంబాన్ని అంతం చేయడానికి రూ.600 కోట్ల డీల్ ఇస్తున్నారన్న ఆడియో వైరల్ అయ్యిందనే అంశంపై విలేకరులతో మాట్లాడుతూ ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఒక కుటుంబాన్ని అంతం చేయమని చెప్పింది ప్రస్తుత గొప్ప ముఖ్యమంత్రే అని సీఎం డీకే శివకుమార్‌పై ఆరోపణలు గుప్పించారు. అందుకే వీటన్నింటిపై విచారణ జరగాలి, పాపపు కుండ నిండిపోయింది. ఇదంతా దేవుడే బయటకు తెస్తున్నాడని స్టింగ్ ఆపరేషన్ అంశాన్ని ప్రస్తావించారు. మా పార్టీ వార్ రూం కార్యకర్తలు పట్టుబడకుండా తప్పించుకున్నారని ఆరోపిస్తున్నారు, ఎవరూ తప్పించుకునే ప్రసక్తే లేదు, వాళ్లు వచ్చి మిమ్మల్ని కలుస్తారన్నారు. స్టింగ్ ఆపరేషన్ దర్యాప్తును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు అని కుమారస్వామి దుయ్యబట్టారు. పలు సర్వేలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఇదే పరిస్థితి, ఏడాది తరువాతైనా ఇంతే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరువు సహాయక నిధులు విడుదల చేయడం లేదని విలేకరులు ప్రస్తావించగా, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇతర సమస్యలపై ఖర్చు చేయడానికి డబ్బు ఉంది. రైతులకు ఇవ్వడానికి లేదా? అని ప్రశ్నించారు.
త్వరలో ఢిల్లీకి సిద్దరామయ్య పయనం
స్టింగ్ ఆపరేషన్, పార్టీలో పరిణామాలపై అగ్రనేతతో చర్చలు
నవంబరు 2న భేటీకి ప్రయత్నాలు
సహాయం కోసం వినతి!
మా కుటుంబం అంతానికి రూ.600 కోట్ల సుపారీ
మొన్నటివరకు ఎదురులేని నేతగా ఉన్న మాజీ సీఎం సిద్దరామయ్యపై స్టింగ్ ఆపరేషన్ ఆరోపణలు రావడం ఆయనను తీవ్రంగా
కుంగదీసింది. పార్టీలోని మనుషులే ఈ కుట్ర చేశారని ఆయనతో పాటు కుమారుడు, మంత్రి యతీంద్ర ఆక్రోశించారు. ఢిల్లీకి వెళ్లి పార్టీ అగ్రనేతలకు పరిస్థితిని వివరించి మద్దతు కోరాలని సిద్దరామయ్య భావిస్తున్నారు. దీంతో స్టింగ్ వ్యవహారం పంచాయితీ హస్తినలోనూ ప్రకంపనలు సృష్టించే అవకాశముంది.


