చిత్రవధకు ఇల్లాలి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

చిత్రవధకు ఇల్లాలి ఆత్మహత్య

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

శివమొగ్గ: భర్త, అత్తమామల వేధింపులను తట్టుకోలేక వివాహిత డెత్‌నోటు రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన జిల్లాలో జరిగింది. మృతురాలు అక్షత (28). తీర్థహళ్లి వద్ద హొడళు గ్రామంలో నివసించే అక్షతకు 8 ఏళ్ల క్రితం స్థానికుడు పురుషోత్తం నాయక్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన రోజు నుంచి అక్షతను ఆమె భర్త, అత్త లీలావతి, ఆడపడుచు నాగరత్న, వాసుదేవలతో సహా కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. పుట్టింటికెళ్లి మరింత కట్నం తేవాలని సతాయించేవారు. ఈ వేధింపులను భరించలేక 22వ తేదీన ఆమె డెత్‌నోట్‌ రాసి పురుగుల మందు తాగింది. గమనించిన భర్త ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స విఫలమవడంతో ఆమె ఆదివారం కన్నుమూసింది. తమ కూతురు మెట్టినింట చిత్రవధను అనుభవించిందని, ఆ మాట తమకెప్పుడూ చెప్పనేలేదని అక్షత తల్లిదండ్రులు విలపించారు. వారి ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో సహా నలుగురిపై తీర్థహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

సాహో.. కల్బుర్గి కందిపప్పు

● మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు

శివాజీనగర: కన్నడనాట కల్బుర్గి కందిపప్పు ప్రాశస్త్యం గురించి తెలియనవారుండరు. ఆ కందిపప్పుతో కుడుములు, ఓళిగలు, పప్పు, సాంబారు.. ఏది వండినా రుచి అదిరిపోతుంది. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సాహో అన్నారు. ప్రధాని మోదీ ఆదివారం 139వ మన్‌కీ బాత్‌ ప్రసంగంలో కల్బుర్గి కంది పప్పును ప్రశంసించారు. తొలిసారిగా మాల్దీవుల దేశంలో కూడా ఈ కందిపప్పు అమ్మకాలు మొదలైనట్లు తెలిపారు. కల్బుర్గి కందిపప్పు మాల్దీవుల్లోని పల్లెలకు చేరుకుందని సంతోషం వ్యక్తంచేశారు.

ఎందుకు ప్రత్యేకం..

కలబుర్గి జిల్లా నేలలో కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ కారణంగా అక్కడ పండించే కందిపప్పు సహజంగా ప్రత్యేకమైన రుచి, సువాసన, సులభంగా ఉడికే గుణంతో ఉంటుందని పేరుంది. ఈ కారణంగా 2019లో ప్రత్యేక జీఐ గుర్తింపు లభించింది.

తల్లికి భారమైన బిడ్డ

●దివ్యాంగురాలిని హత్య చేసి, ఆత్మహత్య

● ఉడుపి జిల్లాలో ఘోరం

యశవంతపుర: చెట్టుకు కాయ భారమా, తల్లికి బిడ్డ భారమా? అని పెద్దలంటూ ఉంటారు. కానీ దివ్యాంగురాలైన కూతురిని పోషించలేక హత్య చేసిన తల్లి తాను ఆత్మహత్య చేసుకున్న బాధాకర సంఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకాలో జరిగింది. శానాది కొరగ కాలనీలో సుధాకర్‌, నేత్రావతి (27), కుమార్తె సుప్రతి (7), కొడుకు నివసిస్తున్నారు. దంపతులు కూలిపనులు చేస్తుంటారు. కుమార్తె పుట్టుక నుంచే తీవ్రమైన వైకల్యంతో బాధపడుతోంది. మాటలు రాని, నడవలేని స్థితిలో ఉన్న సుప్రతిని చూసి తల్లి నేత్రావతి నిత్యం బాధపడేది. తాను లేకపోతే కూతురు ఏమైపోతుందోనని మథనపడేది. దీంతో కఠోర నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం భర్త పనికి వెళ్లిన సమయంలో నేత్రావతి కుమార్తెను గొంతు పిసికి ప్రాణాలు తీసింది, తరువాత తాను ఉరి వేసుకుంది. అదనపు ఎస్పీ సుధాకర్‌, డిఎస్‌పీ బెళ్లియప్ప, బ్రహ్మవర సీఐ గోపికృష్ణ ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement