బనశంకరి: బెంగళూరు కమ్మగొండనహళ్లిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నుంచి రీఫిల్లింగ్ దందా చేస్తున్న దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 23 కు పైగా గ్యాస్ సిలిండర్లు పేలిపోయి భయోత్పాతం ఏర్పడింది. ఓ చిన్న దుకాణంలో శనివారం రాత్రి సుమారు 8:30 సమయంలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ంది. దీంతో భయపడిన దుకాణంలోని వ్యక్తి బయటకు పరిగెత్తాడు.
పెట్రోలుకు అంటుకున్న మంటలు
క్షణాల్లో మంటలు వ్యాపించి దుకాణంలోని సిలిండర్లు వరుసగా పేలిపోవడం మొదలైంది. అదే షాపులో పెట్రోల్, కిరోసిన్ నిల్వ ఉంచి చిల్లరగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. గ్యాస్ మంటలు పెట్రోల్, కిరోసిన్ డబ్బాలకు వ్యాపించడంతో కట్టడం మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుంది.
జనం పరుగులు
సమీపంలోని ప్రార్థన మందిరంలో ఉన్న వందలాది మంది పేలుళ్ల భయంతో దూరంగా పరుగులు తీశారు. పేలుళ్లు, మంటలతో స్థానిక నివాసులు భయకంపితులయ్యారు. చాలామంది ఇళ్లకు తాళం వేసి దూరంగా వెళ్లారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. అదృష్టవశాత్తు ఒకరికి స్వల్ప గాయాలు మినహా ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు.
పేలిన 23 సిలిండర్లు
బెంగళూరు కమ్మగొండనహళ్లిలో
భయోత్పాతం
అధికారులకు కనిపించదా?
నివాస ప్రదేశాల్లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేయడంతో పాటు పెట్రోల్, కిరోసిన్లను విక్రయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలకు అవకాశం ఇచ్చింది ఎవరు?, పోలీసులు, పాలికె అధికారులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రాణహాని సంభవించినట్లైతే ఎవరు బాధ్యులని మండిపడ్డారు. ఇటువంటి దుకాణాలను కనిపెట్టి మూసివేయించాలని డిమాండ్ చేశారు.


