● బెంగళూరు సహా పలు జిల్లాల్లో కవాతు
శివాజీనగర: హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శలు, హెచ్చరికల నేపథ్యంలో, ఆర్‌ఎస్‌ఎస్ పలు జిల్లాల్లో ఆదివారం కవాతులను నిర్వహించింది. కొన్నిచోట్ల ఊరేగింపులకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వగా, మరికొన్ని చోట్ల అనుమతించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందంటూ తుమకూరులో అంగీకరించలేదు.
సర్కారుపై నేతల ధ్వజం
బెంగళూరు సిటీలో 100కి పైగా ప్రదేశాల్లో సంఘ్ కార్యకర్తల ఊరేగింపులు జరిగాయి. వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. జయనగర, చామరాజపేటలో జరిగిన పథ సంచలనంలో బీజేపీ నేతలు ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామితో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఆర్.అశోక్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ అనేది దేశభక్తి, దేశప్రేమ సంస్థ అని అన్నారు. దేశానికి కష్టాలు వచ్చినప్పుడు అండగా నిలిచే సంస్థ ఇది అని ఆయన అన్నారు. ఊరేగింపులకు చివరి నిమిషం వరకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. కల్బుర్గిలోనూ భారీ ప్రదర్శన జరిగింది. మహానుభావుల వేషధారణలో చిన్నారులు మురిపించారు.


