బనశంకరి: పరిసరస్నేహి అనే కారణంతో బెంగళూరులో ఇటీవల మినీ ఎలక్ట్రిక్ బైకుల వాడకం అధికమైంది. ఈ బుల్లి వాహనాల మీద జనం రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. ఈవీ పేరుతో ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోవడం లేదు, ఈ సవారీల వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉంటోందని ఆరోపణలున్నాయి. సిగ్నల్ జంప్, ఫుట్‌పాత్‌పై నడపడం, నో ఎంట్రీ దారుల్లోనూ వెళ్లడం, హెల్మెట్ ధరించకపోవడం ఇలా అన్ని రకాల నిబంధనలను వదిలి మినీ ఈవీ బైకర్లు ప్రయాణిస్తుంటారు. హఠాత్తుగా అడ్డం వస్తూ ఉండడంతో ఇతర వాహనదారులు గందరగోళ పడుతున్నట్లు తెలిపారు.
చట్టంలో లొసుగులు చూసి..
మినీ బ్యాటరీ బైక్‌దారులు ఎడపెడా నడుపుతూ పాదచారుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నప్పటికీ పోలీసులు చూసీ చూడనట్లు ఉంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. 250 వాట్ల కంటే తక్కువ శక్తి కలిగి ఉండే ఈవీ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనలు వర్తించవని మోటారు వాహన చట్టంలో ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఈ బైక్‌లపై జరిమానాలు, కేసులు రాసే ఆస్కారం లేకపోవడం వల్ల మరింతగా రెచ్చిపోతున్నారు.
జాగృతి కల్పిస్తున్నాం
సిటీ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ కార్తీక్‌రెడ్డి స్పందిస్తూ, చట్టంలో కేసు వేయడానికి అవకాశం లేనందున, తాము వాహనదారుల్లో జాగృతి కల్పిస్తున్నామని చెప్పారు. కానీ అతి వేగంతో వెళ్తూ రోడ్డు ప్రమాదాలు, పాదచారులకు ఇబ్బంది కలిగితే ఎవరు బాధ్యులని ఇతర వాహనదారులు ప్రశ్నించారు. ప్రభుత్వం ఈవీ బైక్‌లు, స్కూటర్లకు ట్రాఫిక్ రూల్స్‌పై సమగ్ర చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
ఇష్టానుసారం సంచారం
బెంగళూరువాసులకు ఇబ్బందులు


