హొసపేటె: కూడ్లిగి పట్టణంలో కన్నడ రాజ్యోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తహసీల్దార్ వీకే.నేత్రావతి పిలుపునిచ్చారు. పట్టణ పరిపాలన భవనంలో గురువారం నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యాపారులు, దుకాణదారులు, కన్నడ అనుకూల సంఘాల ప్రతినిధులు, ప్రజలు సమష్టిగా వేడుకల్లో పాల్గొనాలని కోరారు. పట్టణంలో విద్యుత్ దీపాల అలంకరణ, ఊరేగింపు, కన్నడలో అత్యధిక మార్కులు సాధించిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ విద్యార్థులకు సన్మానం, గోకాక్ ఉద్యమ యోధులకు గౌరవ సమర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కన్నడ భాషా సంస్కృతి, ఐక్యతను చాటేలా రాజ్యోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు.


