రాయచూరు రూరల్: రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే దళితుల సమస్యలపై స్పందించకుండా కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమార స్వామిపై నిందలు మోపడం తగదని జేడీఎస్ ఎస్సీ సెల్ జిల్లాధ్యక్షుడు నరసప్ప పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు దళిత హత్యలు జరిగినా నేటి వరకు జిల్లాలో పర్యటించిన, బాధిత కుటుంబాలను పరామర్శించిన సందర్భాలు లేవన్నారు. మాట్లాడే ముందు కేంద్రంలో ఉన్నత హోదాలో ఉన్న కేంద్ర మంత్రిని ఏకవచనంతో సంభోదించడం సరికాదన్నారు.
పాఠశాలకు ప్లేట్ల వితరణ
రాయచూరు రూరల్ : సమాజంలో పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి అడ్డంకులు రాకూడదని ఈడీఆర్‌టీ సంస్థ సంచాలకురాలు రత్న పేర్కొన్నారు. గురువారం తాలూకాలోని పంచముఖి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 250 బ్యాగులు, 1,080 నోట్ పుస్తకాలు, వంద ప్లేట్లు, వంద గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు ప్రాధాన్యత కల్పించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిద్దాలన్నారు.
గ్రామాల్లో విభేదాల సృష్టి తగదు
రాయచూరు రూరల్: మతం పేరుతో గ్రామాల్లో విభేదాలు సృష్టించడం, మదరకల్ అవధూత రాజయోగి నామదేవ్ గౌడ చేస్తున్న శుభకార్యాలకు అడ్డు తగలడం తగదని మహిళా భక్త మండలి సంచాలకురాలు విజయరాణి పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు హనుమనగౌడ, సిద్దనగౌడ అవదూతపై ఆరోపణలు చేసే ముందు వెనుకా ముందు ఆలోచించాలన్నారు. 15 రోజుల పాటు అవధూత అశ్రమంలో జరిగిన కార్యక్రమంలో అత్యధిక శాతం మహిళలు జ్ఞాన బోధ కోసం వచ్చినవారేనన్నారు. తమ కుటుంబ సమస్యలకు పరిష్కారాలు అడగడానికొచ్చిన వారిపై, అవధూతపై నిందలు మోపడం తగదన్నారు. రాష్ట్ర సర్కార్ భూముల్లో మఠం నిర్మించుకున్న ఆశ్రమాన్ని తొలగించాలని జిల్లాధికారికి ఫిర్యాదు చేయడం సబబు కాదన్నారు. బసమ్మ, రత్నమ్మ, రేణమ్మ, మంజమ్మ, చెన్నమ్మ, భీమయ్యలున్నారు.
రథోత్సవ సంబరం
రాయచూరు రూరల్ : జిల్లాలో బుధవారం శరన్నవరాత్రి ఉత్సవాలకు తెరదించారు. సుల్తాన్‌పూర్ బృహన్మఠంలో శ్రీదేవి, కోటలోని కాళికా దేవి ఆలయంలో అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. సుల్తాన్‌పూర్ బృహన్మఠంలో శ్రీదేవి పురాణ మంగళ ప్రవచనం సందర్భంగా చిన్నారులతో నృత్య ప్రదర్శనలు జరిగాయి. కందగడ్డ మారెమ్మ ఆలయంలో విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం భక్తుల సందడి మధ్య రథోత్సవం నిర్వహించారు.
సాగునీటి కోసం ధర్నా
రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ కింద ఉప కాలువల నుంచి ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలని ఒత్తిడి చేస్తూ గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. 92వ ఉపకాలువ ఆయకట్టు రైతులు మాట్లాడుతూ తుంగభద్ర ఎడమ కాలువలో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. 54వ ఉప కాలువ కింది భాగంలో నీరు అందక పోవడంపై విరుచుకు పడ్డారు. 69 వేల ఎకరాలకు నీరందించాలంటే కాలువకు 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. కాలువపై భాగంలో అక్రమంగా వేసుకున్న పైపులను తొలగించాలని ఒత్తిడి చేశారు.


