పరిషత్‌ ఎన్నికల పోరుకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికల పోరుకు వేళాయె

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

సాక్షి,బళ్లారి: ఈశాన్య ఉపాధ్యాయుల నియోజకవర్గం విధాన పరిషత్‌ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. కళ్యాణ కర్ణాటక పరిధిలో బళ్లారి, రాయచూరు, బీదర్‌, కలబుర్గి, యాదగిరి, కొప్పళ, విజయనగర జిల్లాల పరిధిలో ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శశీల్‌ నమోషి, కాంగ్రెస్‌ పార్టీ బలపరుస్తున్న శరణప్ప మట్టూరు గట్టిపోటీ ఇస్తున్నారు. ఆరు జిల్లాల పరిధిలో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును ఆయా జిల్లాల్లో వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజులకు పైగా పోటాపోటీగా ప్రచారం చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు, నాయకుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులు ఎవరికి మద్దతు ఇస్తారా? అని ఆయా పార్టీల్లో ఆందోళన నెలకొంది. నాలుగుసార్లు వరుసగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి శశీల్‌ నమోషి ఈసారి కూడా ఎలాగైనా గెలిచితీరాలన్న పట్టుదలతో తీవ్రంగా ప్రచారం చేశారు.

వైఫల్యాలను ఎండగడుతూ..

అధికార పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, నాలుగుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని గట్టి ప్రచారం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం తనకే వీలవుతుందని ప్రచారం చేశారు. ఇక అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శరణప్ప మట్టూరు కూడా తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఒకసారి ఈశాన్య పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొంది సేవలందించిన ఈయన ఈసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని గట్టి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అఽధికార కాంగ్రెస్‌ పార్టీ అండదండలతో గెలుపొందుతున్నాననే ధీమాతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి తరుపున రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ సీఎం యడియూరప్పలతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు గట్టి ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముమ్మరంగా అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

హోరాహోరీగా ఎన్నికల ప్రచారం

నెల రోజులకు పైగా కళ్యాణ కర్ణాటక పరిధిలోని ఏడు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పోరు హోరాహోరీగా సాగింది. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు ఆమ్‌ ఆద్మీ తదితర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 13 మంది బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికల ప్రచారం నువ్వా, నేనా అన్న విధంగా కొనసాగింది. ఈశాన్య ఉపాధ్యాయుల నియోజకవర్గంలో మొత్తం 34,784 మంది ఓటర్లు ఉండగా, వీరిలో బళ్లారి జిల్లాలో 3,393 మంది, విజయనగరలో 3,326 మంది, బీదర్‌లో 7,038 మంది, కలబుర్గిలో 10,652 మంది, యాదగిరిలో 2,259 మంది, కొప్పళలో 2,714 మంది, రాయచూరులో 5,402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఓటర్లు కలబుర్గి జిల్లాలో ఉండటం గమనార్హం. ఈశాన్య ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సంగ్రామంలో చివరికి విజయలక్ష్మి ఎవరిని వరించనుందో వేచిచూడాల్సిందే.

కల్యాణ కర్ణాటక ప్రాంత చిత్రపటం

ఈసారి ఉపాధ్యాయ ఓటర్ల మొగ్గు

ఎవరి వైపో మరి?

ఐదోసారి అదృష్టం పరీక్షించుకోనున్న శశీల్‌ నమోషి

ఎలాగైనా గట్టెక్కాలని

శరణప్ప మట్టూరు గట్టిపోటీ

నేడే ఈశాన్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

రాయచూరు రూరల్‌: ఈశాన్య ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో శుక్రవారం ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. కళ్యాణ కర్ణాటక పరిధిలోని బీదర్‌, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయ నగర జిల్లాల్లో సుమారు 35 వేల మంది ఓటర్లు ఉండగా, రాయచూరు జిల్లాలో 5,402 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బీజేపీ అభ్యర్థి శశీల్‌ నమోషి, కాంగ్రెస్‌ అభ్యర్థి శరణప్ప మట్టూరుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement