రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో ఇటీవల కేంద్ర కరువు బృందం పర్యటించింది. అయినా కరువు జిల్లాలపై ఏమాత్రం కరుణించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నా ఫలితం దక్కలేదు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు పీడిత ప్రాంతాలుగా మారాయి. రాయచూరు జిల్లాలో నదుల్లో నీటి ప్రవాహాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాయచూరు, యాదగిరి జిల్లాల్లో కృష్ణా నది ఉన్నా నీరు అందక రైతులు తమ భూముల్లో వేసుకున్న వరి, పత్తి, కంది పంటలు ఎండిపోతున్నాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులున్నా ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనులు లభించక కూలికార్మికులకు వలసలు తప్పడం లేదు. రాయచూరు జిల్లాలో 6, యాదగిరిలో 4, బీదర్‌లో 3, కలబుర్గి జిల్లాలో 11 తాలూకాలను కరువు పీడిత తాలూకాలుగా గుర్తించినా కేంద్ర కరువు అధ్యయన బృందం పర్యటించలేదు. రైతులు జిల్లాలో లక్షా 70 వేల ఎకరాల్లో పత్తి, లక్షా 50 వేల ఎకరాల్లో వరి, 86 వేల ఎకరాల్లో కంది పంటలు సాగు చేశారు. రాయచూరు తాలూకా కడగందొడ్డిలో 18 ఎకరాల్లో వేసిన పత్తి పంటను రైతన్న తొలగించారు. లింగసూగూరు తాలూకా గురుగుంటలో హుసేనప్ప తన పొలంలో వేసిన వరి పంట నీరు లేక ఎండిపోయింది.
కరువు పీడిత జిల్లాలపై కరుణించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో పర్యటించని వైనం


