శివాజీనగర: విజయదశమి సంబరాలు అంతటా ఊపందుకున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని ఆయుధ పూజ పండుగను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. సోమవారం నుంచి రాజధాని బెంగళూరు నగరంతో పాటు అన్ని జిల్లాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విశేషంగా అలంకరించి దుర్గాదేవికి, ఇష్టదైవాలకు పూజలు నిర్వహించారు. అలాగే దుకాణాలు, బ్యాంకులు, పరిశ్రమల్లో సుందరంగా అలంకరించి యంత్ర పరికరాలు, వాహనాలను పూజించారు. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుంచి చిరు వ్యాపారులు, వృత్తిదారుల వరకూ ఆయుధ పూజను నిర్వహించారు.
మార్కెట్లలో సందడి
బెంగళూరులో ప్రధాన మార్కెట్లలో పండుగ షాపింగ్ జోరుగా కొనసాగుతోంది. కే.ఆర్.మార్కెట్, మడివాళ, మల్లేశ్వరం, గాంధీబజార్ సహా పలు బజార్లలో ప్రజలు పూలు పండ్లు, గుమ్మడికాయలు తదితర పూజా సామాగ్రిని కొనుగోళ్లు చేశారు. పూల విక్రయాలకు పేరుపొందిన కే.ఆర్.మార్కెట్‌కు బెంగళూరు నలుమూలల నుంచి రావడంతో తీవ్ర రద్దీ నెలకొంది.
నింగిలోకి పూల ధరలు
కరువు వల్ల పూల దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరిగాయి. మంగళవారానికి మరింత డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ధరలు కూడా భగ్గుమంటాయని వ్యాపారులు చెప్పారు. చామంతులు కేజీ 200 నుంచి 250 మధ్య, మల్లెలు రూ.500 పలుకుతున్నాయి. మూర చామంతుల పూలహారానికి 100 నుంచి 150 కి చెల్లించాలి.
వాహనాల పూజలకు వాడే నిమ్మకాయ ధర ఒక్కోటి రూ.10 వద్ద ఉంది. అయినప్పటికీ పండుగ కోసం ప్రజలు కొనుగోళ్లకు వెనుకాడలేదు. మంగళవారం కూడా ఆయుధ పూజ కొనసాగనుంది. రాష్ట్రంలో చాలావరకూ బుధవారం దసరా పండుగను ఆచరిస్తారు. మంగళవారం సాయంత్రం నుంచి దశమి ప్రవేశిస్తుందని, బుధవారం సంపూర్ణంగా ఉంటుందని అర్చకులు తెలిపారు
భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ
రాష్ట్రంలో బుధవారం దసరా!
గవర్నర్ సుధా యాదవ్ పూజలు
దుర్గమ్మ చల్లగా చూడాలి
యశవంతపుర: దసరా పండుగ, ఆయుధ పూజ సందర్భంగా గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్ లోక్‌భవన్‌లో విశేష పూజలు చేశారు. రాష్ట్రంలో శాంతి, సమృద్ధి నెలకొనాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. మొదట తమ చాంబర్‌లో, తరువాత బ్యాంక్వెట్ హాల్‌లో దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. దుర్గా మాత కృపతో రాష్ట్రం ప్రగతి సాధించాలని కోరారు. విధులను గౌరవించడమే ఆయుధ పూజ సందేశమన్నారు. ఉపకరణాలకు గౌరవమివ్వడం భారతీయ పరంపర అని తెలిపారు. విజయదశమి స్ఫూర్తితో సత్య, ధర్మ మార్గంలో ముందుకు సాగాలన్నారు.


