దూసుకెళ్తున్న జెట్లు, (ఇన్‌సెట్) వీక్షిస్తున్న ప్రేక్షకులు
మైసూరు: దసరా మహోత్సవంలో లోహ విహంగాలు రంజింపజేశాయి. రెండో రోజూ సోమవారం ఎయిర్ షో కొనసాగింది. ఆదివారం మేఘావృతం, చినుకుల వల్ల 5 నిమిషాలకే ఎయిర్ షోను ముగించడం తెలిసిందే. దీంతో వేలాది మంది ప్రేక్షకులు నిరాశపడ్డారు. సోమవారం మళ్లీ పంజిన కవాతు మైదానం వినీలాకాశంలో ఎయిర్ షో విజయవంతంగా సాగింది. 20 నిమిషాల పాటు ఆకాశంలో 9 సూర్యకిరణ్ ఏరోబాటిక్ జెట్లు గర్జిస్తూ రకరకాల విన్యాసాలను ప్రదర్శించాయి. పిల్లలు, పెద్దలు కేరింతలు కొట్టారు. రంగురంగుల పొగలను వదులుతూ నిట్టనిలువుగా ఎగరడం, మధ్యలో వంపులు తిరగడం, వేగంగా దూసుకెళ్లే ఫీట్లు అబ్బురపరిచాయి.
నెమలికి గిన్నిస్ రికార్డు
ఆదివారం జరిగిన డ్రోన్ల ప్రదర్శన గిన్నిస్ రికార్డు సాధించింది. ఈసారి 3,473 డ్రోన్లతో సృష్టించిన నెమలి ఆకారానికి ఈ రికార్డు దక్కింది. గత దసరా వేడుకల్లో 2,983 డ్రోన్లతో పులిని ఆకాశంలో రూపొందించారు. ఈసారి అంతకుమించిన డ్రోన్లతో చేసినట్లు గిన్నిస్‌బుక్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వగా రికార్డు నమోదు చేశారని అధికారులు తెలిపారు.
మైసూరు దసరాలో ఎయిర్ షో


