అద్దె ఇస్తామంటూ.. ఇంటి యజమాని కాల్చివేత | - | Sakshi
Sakshi News home page

అద్దె ఇస్తామంటూ.. ఇంటి యజమాని కాల్చివేత

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

బనశంకరి: హంతకులు ఇంటి తలుపుతట్టి బయటకు రమ్మని పిలవడంతో న్యాయవాది ఇంట్లో నుంచి రాగానే పిస్టల్‌తో కాల్చిచంపారు. ఈ ఘటన బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పట్టందూరు అగ్రహార నివాసి మంజునాథ్‌ (42) హతుడు. బిహార్‌ వలస కూలీల ద్వారానే హత్య జరిగినట్లు ఆరోపణలున్నాయి.

ఆస్పత్రికి తరలించగా..

కాల్పుల శబ్ధం విని మంజునాథ్‌ భార్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి రక్తపుమడుగులో పడి ఉన్న భర్తను చూసి కేకలు వేసింది. ఇరుగుపొరుగువారి సాయంతో మణిపాల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి మృతిచెందాడని తెలిపారు. మృతుని సోదరుడు మునిరాజు మాట్లాడుతూ అద్దెదారుడు అంకిత్‌కుమార్‌ దూబె, అతని స్నేహితుడు కలిసి హత్య చేశారని చెప్పాడు. వీరిద్దరు ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తారు. మంజునాథ్‌కు ఐదుమంది సోదరులు కాగా సుమారు 50 ఇళ్లు అద్దెకు ఇచ్చారు. దుండగులు పరారీలో ఉన్నారు.

శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం

వైట్‌ఫీల్డ్‌ డీసీపీ సైదులు అడావత్‌, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఇంటి సీసీ కెమెరాలలో హత్య దృశ్యాలు రికార్డయ్యాయి. డీసీపీ మాట్లాడుతూ అద్దెదారులతో గొడవ ఇతరత్రా కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హంతకుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా బెంగళూరులో వలస కూలీల దురాగతాలు ఎక్కువైనట్లు ఆందోళన నెలకొంది. చీటికిమాటికీ స్థానికులతో గొడవలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనికి తోడు గన్‌ కల్చర్‌ కూడా తోడు కావడంతో తీవ్ర కలవరం నెలకొంది. ఇక్కడ నేరాలు చేసి సొంతూళ్లకు పరారవుతారు. వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతోంది.

హతుడు న్యాయవాది

బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఘటన

బిహార్‌ వలస కూలీల పనే!

పరారీలో ఇద్దరు దుండగులు

బాడుగ కోసం రగడ..

మంజునాథ్‌ కుటుంబానికి స్థానికంగా అనేక ఎకరాల భూములు, స్థలాలు ఉన్నాయి. అక్కడ 50 లేబర్‌ షెడ్లు నిర్మించి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు బాడుగకు ఇచ్చాడు. ఓ కార్మికుడు 3 నెలల నుంచి అద్దె కట్టడం లేదు. అద్దె డబ్బులు అడగడానికి మంజునాథ్‌ వెళ్లగా ఇద్దరి మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన అద్దెదారుడు హత్యకు కుట్ర పన్నాడని అనుమానాలున్నాయి. బాడుగ డబ్బు ఇస్తామని మంజునాథ్‌ మొబైల్‌కు ఫోన్‌ చేసిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి మంజునాథ్‌ ఇంటికి వెళ్లారు. కాలింగ్‌ బెల్‌ నొక్కగా, మంజునాథ్‌ ఇంటి డోర్‌ తీయగానే ఒక వ్యక్తి డబ్బు ఇస్తున్నట్లు నటించాడు. మరొకడు పిస్టల్‌ తీసి కాల్చాడు. ఒక బుల్లెట్‌ మంజునాథ్‌ తల, రెండు బుల్లెట్లు ఎదలోకి దూసుకెళ్లడంతో అక్కడే పడిపోయాడు. హంతకులు పరారయ్యారు.

మంజునాథ్‌ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement