బేతాళ దేవాలయంలో భారీ విగ్రహం
కేజీఎఫ్: కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని సరిహద్దు ప్రాంతమైన కంగాండ్లహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని ఐవారహళ్లిలో ఉన్న బేతాళ మహాశక్తి పీఠ దేవాలయంలో చేతబడి వంటి క్షుద్రపూజలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో బుధవారం ఎస్పీ శివాంశు రాజ్‌పుత్ తనిఖీ చేశారు. ఆలయంలో ఉన్న ఎత్తైన అమ్మవారు, భేతాళ విగ్రహాలను వీక్షించారు. ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ దేవాలయంలో చేతబడి జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు అందాయని అందుకు నేడు పరిశీలన చేసి చేతబడి చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కర్ణాటక మూఢనమ్మకాల ప్రతిబంధక చట్టం కింద వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా మహిళలను అక్రమంగా ఉంచడం, వేధించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. డీఎస్పి లక్ష్మయ్య, బేతమంగల సీఐ జగదీష్, ఎస్‌ఐ సంగమేష్ ఉన్నారు. ఇక్కడ చేతబడి చేసేవారిని అడ్డుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. చేతబడి చేస్తున్నట్లు అనుమానిస్తున్న అఘోరి చంద్రనాథ్ తో పాటు 7 మందిని అరెస్టు చేసి వారిని కోర్టుకు తరలించారు.
క్షుద్రపూజలు జరుగుతున్నాయని ఫిర్యాదు
అఘోరి సహా 7 మంది అరెస్టు


