నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కలేనా?
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడంతో ఆ నీటిని నిల్వ చేసుకుని వాడుకునేందుకు వీలుగా నూతనంగా కొప్పళ జిల్లా గంగావతి తాలూకా నవలి వద్ద నిర్మించతలపెట్టిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కలేనా? అనే అనుమానాలు అధికమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్ప రూ.15 వేల కోట్లతో నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతినిచ్చారు. అయితే ఇంతవరకు ఆ పథకం కార్యరూపం దాల్చక పోవడంతో ఇక ఆ పథకానికి గ్రహణం పట్టినట్లేనని రైతులు భావిస్తున్నారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల అమరిక పనులు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నవలి జలాశయం నిర్మాణానికి తిలోదకాలిచ్చినట్లేనని అనుకుంటున్నారు. రూ.15 వేల కోట్ల వ్యయంతో చేపట్టడం కంటే డ్యాంకు క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేస్తే మరో 50 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అంశాన్ని గమనించిన సర్కార్ నవలి వద్ద నిర్మించే జలాశయానికి వేసిన పునాదులు పేరుకు మాత్రమేననే చర్చలు వినబడుతున్నాయి. కొప్పళ, రాయచూరు జిల్లాల రైతులకు నవలి వద్ద జలాశయం ఏర్పాటైతే ఆయకట్టు చివరి భూముల రైతులకు సక్రమంగా నీరందుతాయనే భావనకు ప్రభుత్వం తీరు గొడ్డలిపెట్టుగా మారింది. ఆ పథకం మరుగున పడితే తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూముల రైతుల ఆశలు అడియాసలు అయ్యే ప్రమాదం ఉంది.


