అంబరం.. భోగి సంబరం
సాక్షి,బళ్లారి: మన సంస్కృతి, వారసత్వాలకు అద్దం పట్టేలా భోగి పండుగను ఘనంగా ఆచరించారు. బుధవారం భోగి పండుగ నేపథ్యంలో ఇంటింటా భోగి మంటలు వేసుకుని పండుగకు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు నేపథ్యంలో మొదటి రోజు జరుపుకునే భోగి పండుగ రోజున తెల్లవారుజామున లేచి ఇంటిముందు భోగి మంట వేసి మనలోని ఈర్ష, ద్వేషాలు, కోపం తదితర దుర్గుణాలను అగ్నిలో దహించి కొత్త జీవితానికి నాంది పలకాలనే ఉద్దేశ్యంతో భోగి పండుగను ఆచరిస్తున్నట్లు పండుగ నేపథ్యం చెబుతోంది.
భోగి మంటలతో పండుగ ఆచరణ
నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను పెద్ద ఎత్తున ప్రతి ఇంటి ముందు మంట వేసుకుని ఆచరించారు. ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు తుంగభద్ర ఆయకట్టు పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు లక్షలాది మంది తెలుగు వారికి భోగి, సంక్రాంతి అంటే పెద్ద పండుగ కావడంతో తెలుగువారితో పాటు కన్నడిగులు అందరూ ఇంటింటా భోగి పండుగను ఘనంగా ఆచరించారు. ఇక ఇప్పటికే రైతుల ఇంటికి అన్ని రకాల పంటలు కూడా వచ్చి చేరాయి. తుంగభద్ర ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు కూడా రైతులకు చేతికందాయి. దీంతో రైతన్నలు కూడా పల్లెల్లో సంతోషంగా పండుగను జరుపుకున్నారు.
ఇంటింటా విరిసిన రంగవల్లులు
ఇంటింటా మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మడి కాయలు పగలగొట్టి, రంగురంగుల పువ్వులతో అలంకరించి ఆచరించారు. ఈ పండుగకు ప్రత్యేకంగా పిండివంటలతో పాటు సజ్జరొట్టెలు, నూనె వంకాయ తదితరాలు చేసుకుని కుటుంబసభ్యులతో కలిసి పండుగకు స్వాగతం పలికారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో జిందాల్ స్టీల్ ఇండస్ట్రీతో పాటు వివిధ పరిశ్రమలు, తుంగభద్ర డ్యాం ఉండటంతో ఇక్కడ తెలుగు ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగాలు చేస్తున్న తరుణంలో గత మూడు రోజుల నుంచి వారి స్వగ్రామాలకు సంక్రాంతికి బయలుదేరి వెళ్లారు.దీంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హరిదాసులు గంగిరెద్దులు పట్టుకుని పల్లెటూళ్లలో సందడి చేశారు. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటలు దాదాపు చేతికందడంతో హరిదాసులకు తమకు తోచిన దానం చేసి ఉదారతను చాటుకున్నారు.
ధరలు పెరిగినా సంబరాలు అదుర్స్
రాయచూరు రూరల్ : నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినా, కాయగూరల ధరలకు రెక్కలు వచ్చినా మార్కెట్‌లో పెరుగుతున్న రేట్లను లెక్కచేయకుండా జిల్లా ప్రజలు సంక్రాంతి సంబరాలకు సన్నద్ధం అయ్యారు. బజారులో ధరలు మాత్రం విపరీతంగా పెరగడంతో ప్రజలు గత్యంతరం లేక కొనుగోలు చేస్తున్నారు. తమ ఇళ్ల ముందు మహిళలు, బాలికలు రంగు రంగులతో కూడిన సంక్రాంతి ముగ్గులను వేశారు. చెరుకు గడ, గుమ్మడికాయలు, పూలు, చింతపండు, నువ్వులు, వేరుశనగ, బెల్లం ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ బెల్లం రూ.80, సేరు నువ్వులు రూ.150, గుమ్మడి కాయ రూ.75, కిలో చింతకాయలు రూ.175, చెరుకుగడ రూ.90 ఒకటి, మూర పూలు రూ.50 ధర పలకడంతో ప్రజలు సంప్రదాయం కోసం వాటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. శెనగ చెట్ల కట్ట రూ.50 చొప్పున విక్రయించారు. మకర సంక్రాంతిని ఆచరించేందుకు ఇక్కడి ప్రజలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. బుధవారం తెల్లవారు జామున నిజలింగప్ప కాలనీ వద్ద భోగి మంటలు వేశారు. మరో వైపు మడివాళ నగర్‌లో యువతులు రంగులతో కూడిన ముగ్గులు వేశారు.
ధార్వాడలో సంక్రాంతి సుగ్గి వేడుకలు
హుబ్లీ: సూర్యుడు తన పథాన్ని మార్చుకొనే సందర్భంగా జరుపుకొనే మకర సంక్రాంతి పండుగ వేడుకలను ధార్వాడ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం బేషుగ్గా జరిపారు. కళాశాల మీటింగ్ హాల్‌లో చక్కగా పాడి పంటలకు ప్రతీకగా వస్తువులను, ధాన్యాలను ఉంచి పూజలు చేశారు. పరస్పరం నువ్వులు, బెల్లం పంచుకొని నోటిని తీపి చేసుకొని సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు తెల్ల దుస్తులతో ఆకట్టుకోగా బాలికలు వైవిధ్యమయమైన డ్రెస్సులతో, చీరలతో ఆదరగొట్టారు. తొలి పండుగ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను కన్నడిగులు భక్తితో సుగ్గి హబ్బ అంటే సుగ్గి పండుగగా పిలుచుకుంటారు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, భారత దేశ ఘనత, గొప్ప సత్సంప్రదాయాలకు ప్రతీక అయిన నాలుగు రోజుల భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ వేడుకల సమ్మేళనంగా కళాశాల ఆవరణలో ఆచరించారు.
సంస్కృతి, వారసత్వాలకు
అద్దం పట్టేలా వేడుకలకు శ్రీకారం
సంక్రాంతి పండుగకు
భారీగా పల్లెలకు తరలిన జనం
అంబరం.. భోగి సంబరం
అంబరం.. భోగి సంబరం
అంబరం.. భోగి సంబరం
అంబరం.. భోగి సంబరం
అంబరం.. భోగి సంబరం


