ఫిబ్రవరి 13 నుంచి హంపీ ఉత్సవాలు
హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీ ఉత్సవాలు–2026ను ఈసారి ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాలు, గృహ నిర్మాణ, వక్ఫ్ శాఖ మంత్రి బీజెడ్.జమీర్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. బుధవారం హొసపేటెలోని అమరావతి అతిథిగృహంలో ఆయన ముందుగా హంపీ ఉత్సవం–2026 లోగోను విడుదల చేశారు. హంపీ ఉత్సవ సన్నాహాల గురించి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం హంపీ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. అంతకు ముందు ఎంపీ ప్రకాష్ హయాంలో నవంబర్ నెలలో హంపీ ఉత్సవాలు జరిగేవని గుర్తు చేశారు.
స్థానిక కళాకారులకు పెద్దపీట
హంపీ ఉత్సవంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా స్థానిక కళాకారులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా రవాణా, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా తాను రెండు ఉత్సవాలను విజయవంతం చేశానని, ఇది మూడో ఉత్సవమని, దీనిని ఘనంగా జరుపుతామని ఆయన అన్నారు. బళ్లారి ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు లతా మల్లికార్జున్, గణేష్, నారా భరత్‌రెడ్డి, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్ మహ్మద్ అలీ అక్రం షా, జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మూడు రోజులు ఘనంగా
నిర్వహణకు నిర్ణయం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి
జమీర్ అహ్మద్ ఖాన్ వెల్లడి


