ఉపాధి హామీ పేరు మాత్రమే మార్చలేదు
సాక్షి,బళ్లారి: దేశానికి స్వాతంత్య్రం తేవడానికి ప్రాణత్యాగం చేసిన జాతిపిత మహాత్మాగాంధీజీ పేరును నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెడితే, ఆ పేరును మోదీ సర్కార్ తొలగించడం సరికాదని, పేరును మాత్రమే తొలగించలేదని, రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం ద్వారా రావాల్సిన నిధుల్లో 40 శాతం కోత విధించారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ మండిపడ్డారు. ఆయన బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకానికి అయోధ్య రాముడు పేరు కాదని, గాంధీజీని హత్య చేసిన నాథురాం గాడ్సే పేరును పోలినట్లుగా పెట్టిన పేరు కనిపిస్తోందన్నారు. నిధుల్లో కోత విధించడం వల్ల పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అంతేగాకుండా కక్ష సాధింపు రాజకీయాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందన్నారు.
ఫ్లెక్సీ రగడ, కాల్పులపై సీఐడీ విచారణ చేస్తోంది
బళ్లారిలో బ్యానర్ రగడ, కాల్పులకు సంబంధించి సమగ్ర విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును సీఐడీకి అప్పగించారన్నారు. తనిఖీ చేసిన తర్వాత పూర్తి ఆధారాలు లభ్యం అవుతాయన్నారు. తప్పు ఎవరు చేసినా, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. బ్యానర్ వివాదంపై బీజేపీ నాయకులు పాదయాత్ర చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఎవరి కోసం, ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఐదు సంవత్సరాలు కొనసాగుతారన్నారు. అయితే ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటామన్నారు. సీఎల్‌పీ సమావేశంలో సీఎంగా సిద్దూ ఐదేళ్లు కొనసాగుతారని అప్పట్లో తీర్మానం చేశారన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీలో ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, గణేష్, లోక్‌సభ సభ్యుడు తుకారాం, మేయర్ గాదెప్ప, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో
40 శాతం కోత విధించారు
ఐదేళ్ల పాటు సీఎం సిద్ధరామయ్యే
బీజేపీ పాదయాత్ర ఎందుకు
చేస్తున్నారో వారికే తెలియాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి
జమీర్ అహమ్మద్ ఖాన్


