17న బీజేపీ, జేడీఎస్ భారీ సమావేశం
సాక్షి,బళ్లారి: జనవరి 1వ తేదీన నగరంలోని సిరుగుప్ప రోడ్డులో మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద జరిగిన ఫ్లెక్సీ రగడ, కాల్పులతో ఒక యువకుడు మృతి చెందిన ఘటనతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఈనెల 17వ తేదీన నగరంలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీరాములు పేర్నొన్నారు. ఆయన బుధవారం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. నగరంలో బ్యానర్ రగడ, కాల్పులకు సంబంధించి అన్ని ఆధారాలు, వీడియోలు పోలీసులకు లభించినా, ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, ఆయన ఆప్తుడు సతీష్‌రెడ్డిలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి 15 రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు?
మరో పక్క బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు? అని శ్రీరాములు ప్రశ్నించారు. ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని అంతం చేయడానికి కుట్రలు చేసి, కాల్పులు జరిపారని మండిపడ్డారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. వీటిన్నింటిపై ఈనెల 17న పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామన్నారు. బళ్లారి కేంద్రంగా బృహత్ సమావేశం ఏర్పాటు చేస్తుండటంతో ఆ సమావేశానికి కేంద్ర మంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారరస్వామితో పాటు, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, దాదాపు లక్ష మంది జనం చేరుతున్నట్లు తెలిపారు. అదే రోజున బళ్లారి నుంచి బెంగళూరుకు పాదయాత్ర చేయాలని తీర్మానం చేశామన్నారు. రూట్‌మ్యాప్ కూడా సిద్ధం చేసి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
అనుమతిస్తే ఆ రోజు నుంచే పాదయాత్ర
పాదయాత్రకు అనుమతి లభిస్తే అదే రోజు నుంచి 20 రోజుల పాటు బెంగళూరుకు పాదయాత్ర చేసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబడతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలు పెరిగిపోతున్నాయని భగ్గుమన్నారు. నగరంలో మట్కా, గ్యాంబ్లింగ్, పేకాట తదితర అసాంఘీక కార్యకలాపాలు పెట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి విపరీతంగా పెరిగిపోవడం వల్ల యువత పెడదోవ పడుతోందన్నారు. సతీష్‌రెడ్డి వద్ద ఉన్న గన్‌లైసెన్స్‌కు ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యే టీ.హెచ్.సురేష్‌బాబు, బీజేపీ నాయకులు గురులింగనగౌడ, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై ప్రభుత్వాన్ని ఎండగడతాం
కేంద్ర మంత్రి కుమార, పార్టీ నేతలు అశోక్, విజయేంద్రల రాక
సమావేశం అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుడతాం
అన్ని ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీరాములు సూటి ప్రశ్న


