రోడ్డు నియమాలపై జాగృతి అవసరం
బళ్లారిటౌన్: రోడ్ల నియమాలపై ప్రజలకు జాగృతి కల్పించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా రోడ్డు సురక్షత సమితి సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. నగర శివార్లలో ఎక్కువగా వినియోగిస్తున్న సర్వీసు రోడ్లను మరమ్మతు చేయాలన్నారు. అత్యవసరంగా ఉన్న చోట పాడైన రోడ్లను గుర్తించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద గోతులు ఉన్న చోట ముందు జాగ్రత్తగా ప్రమాద సూచిక బోర్డులను అమర్చాలన్నారు. జిల్లా ఆస్పత్రి, పాఠశాల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించే దిశలో వేగ నిరోధక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో అక్రమించిన పుట్‌పాత్‌లపై అంగళ్లను తొలగించి ప్రజలకు సంచరించేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఆటోలకు పార్కింగ్ సౌకర్యం ఉన్న చోట బోర్డులు పెట్టాలన్నారు. ఏఎస్పీ నవీన్ కుమార్, బుడా కమిషనర్ ఖలీల్ సాబ్, వివిధ స్థాయి అధికారులు పాల్గొన్నారు.


