పేదల సంజీవిని హులకోటి ఆస్పత్రి
సాక్షి,బళ్లారి: మానవ శరీరంలో ప్రధానంగా ప్రతి ఒక్కరికీ అవసరమైన కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు సరైన వైద్యం దొరకక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి కిడ్నీ సమస్యలు వస్తే కర్ణాటకలోని గదగ్ జిల్లా హులకోటిలో వెలసిన కే.హెచ్.పాటిల్ ఆస్పత్రి కిడ్నీ రోగులకు సంజీవినిగా మారింది. మూత్ర పిండాల మార్పిడిలో ఈ ఆస్పత్రి ఆరుదైన రికార్డు సృష్టించింది. దేశ వైద్య రంగంలో గదగ్ తాలూకా హులకోటి ఆస్పత్రి పరిశోధన కేంద్రం వైద్యులు సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా సుదీర్ఘ, తీవ్ర వ్యాధులకు, అతి తక్కువ ధరలోనే చికిత్సలు అందించారు.
రక్త గ్రూపులు మారినా కిడ్నీ మార్పిడి చేస్తున్న వైద్యులు
తొలిసారి వైద్య రంగంలో వేర్వేరు రక్త నమూనాలు కలిగిన వ్యక్తులకు మూత్ర పిండాలు మార్చడం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగానే తోటి ఆస్పత్రులకు స్పూర్తిగా నిలిచారు. గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి(మూత్రపిండాల మార్పిడి) విజయవంతం కావడం విశేషం. ఈ అరుదైన సాధనపై ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ కథనం ప్రకటించడం ద్వారా గదగ్ జిల్లా హులకోటి ఆస్పత్రి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పేరు గడించింది. కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన ఆస్పత్రుల్లో మాత్రమే ఇన్నేళ్లుగా సాధ్యపడుతున్న కిడ్నీ మార్పిడి చికిత్సలు గ్రామీణ పేద ప్రజలకు చేరాలన్న సంకల్పంతో హులకోటిలోని ఆస్పత్రి యువ వైద్యుల బృందం సాహసానికి ఒడిగట్టింది.
ఏడాదిలో 12 కిడ్నీ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి
కిడ్నీ బాధితులకు కే.హెచ్.పాటిల్
ఆస్పత్రి ఆసరా
మూత్రపిండాల మార్పిడిలో
రికార్డు సృష్టించిన వైనం
దేశంలోనే గ్రామీణ ప్రాంతంలో
నెలకొన్న ఏకై క ఆస్పత్రి
ఈ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి సదరు కిడ్నీ బాధితులకు ప్రాణ భిక్ష పెట్టారు. వీటిలో 9 కేసుల్లో బంధువులే కిడ్నీలు దానం చేయగా, మిగిలిన రెండు కేసుల్లో బ్రెయిన్‌డెడ్ ద్వారా తీసుకున్న కిడ్నీలతో మార్పిడి చేశారు. ఆ మేరకు బ్రెయిన్‌డెడ్ ద్వారా తీసుకున్న కిడ్నీలను హుబ్లీకి తరలించి, అక్కడ నుంచి హులకోటి ఆస్పత్రికి తరలించి అవయవమార్పిడి చేసి, యువ వైద్యుల బృందం తమ కృషిని చాటుకున్నారు. ఈ కీలకమైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ప్రక్రియలో నిపుణులైన వైద్యులు డాక్టర్ అవినాష్ ఓదుగౌడ్రు, డాక్టర్ పవన్ కోళివాడ, డాక్టర్ ఎస్.ఆర్.నాగనూరు నేతృత్వంలో సమస్యను సవాల్‌గా స్వీకరించిన యువ వైద్యుల బృందం రోగి, కిడ్నీ దాతలవి వేర్వేరు రక్త గ్రూపులు అయినా కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేయడం గమనార్హం.
పేదల సంజీవిని హులకోటి ఆస్పత్రి


