విమ్స్‌లో బాలుడి మృతిపై నిరసన
సాక్షి,బళ్లారి: నగరంలోని విమ్స్ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ సోమవారం ఉదయం అతడి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరి ఆందోళన చేశారు. నగరంలోని విమ్స్ ఆస్పత్రి వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమిగూడి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. నగర శివార్లలోని ఆంధ్రాళ్‌కు చెందిన రవి, శాంత అనే దంపతుల కుమారుడు అరుణ్(8) అనే బాలుడికి కడుపునొప్పి రావడంతో 20 రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. అపెండిసైటిస్ వచ్చిందని తెలిపి, ఆ బాలుడికి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజులకు బాలుడికి మళ్లీ కడుపునొప్పి రావడంతో తిరిగి విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మళ్లీ అదే చోట ఆపరేషన్ చేసినా నయం కాక మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు సరిగా ఆపరేషన్ చేయడం రాదని చెప్పి ఉంటే బెంగళూరుకు తీసుకెళ్లేవారిమని వారు భోరుమన్నారు. పెద్ద సంఖ్యలో జనం గుమికూడడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. తమ బాలుడు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని తల్లిదండ్రులు రోదించారు. ఇక్కడ పని చేసే వైద్యులు కొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బుల కోసం కక్కుర్తితో నిర్లక్ష్యంగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తమ బిడ్డను వైద్యులు తిరిగి తెచ్చివ్వగలరా? అని ప్రశ్నించారు. అయితే ఆందోళనకారులకు పోలీసులు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.
ఆస్పత్రి ముందు ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
విమ్స్‌లో బాలుడి మృతిపై నిరసన


