మేయర్‌గా గాదెప్ప బాధ్యతల స్వీకారం
సాక్షి,బళ్లారి: నగర నూతన మేయర్‌గా గాదెప్ప అధికార బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఆయన మహానగర పాలికె కార్యాలయంలో సంబంధిత అధికారి నుంచి మేయర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు ఆయన వినూత్న తరహాలో కనక దుర్గమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా వచ్చారు. మహానగర పాలికె కార్యాలయాన్ని మామిడి ఆకులు, అరటి పిలకలు, పచ్చి కొబ్బరి మట్టలతో అందంగా తీర్చిదిద్దారు. గతంలో ఎన్నడూ, ఏ మేయర్ అధికార బాధ్యతలు తీసుకునే ముందు కూడా చేయని విధంగా అందరిని ఆకట్టుకునేలా పెండ్లి మంటపంలా తీర్చిదిద్ది మేళతాళాలతో పాలికె కార్యాలయం మార్మోగిపోయింది. అనంతరం బ్రాహ్మణులతో పాటు కమ్మరచేడు కళ్యాణ స్వామి సమక్షంలో పూజలు నిర్వహించి మేయర్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పాలికె మేయర్ పదవిని కట్టబెట్టారన్నారు. కార్పొరేటర్లు, నగర ప్రజలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఆశయాలకనుగుణంగా పని చేస్తానన్నారు. నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తామన్నారు. రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీలను బాగు చేస్తామన్నారు. ముఖ్యంగా ఇంటింటా చెత్త సేకరణ పనులు బాగా చేసే విధంగా మరింతగా చర్యలు తీసుకుంటామన్నారు. నగర సమస్యలపై నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు, పార్టీలకతీతంగా నేతలు వచ్చి ఆయన్ను అభినందించారు.


