ఆ ఒక్కరి వల్లే గెలవలేదు
● డీకే శివపై మంత్రి సతీశ్ జార్కిహొళి విమర్శలు
శివాజీనగర: కొంతమంది ద్వారానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనటాన్ని ఒప్పుకోను. 1 కోటి 25 లక్షల మంది ఓటర్లచే తాము ఎమ్మెల్యేలు, మంత్రి అయ్యాము, అన్నీ నేనే చేశాను అనడం చాలా తప్పు అవుతుందని పరోక్షంగా డీసీఎం డీకే శివకుమార్‌పై ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి విమర్శలు గుప్పించారు. ఆదివారం బెళగావిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, పార్టీ అధికారంలోకి రావడానికి అనేక మంది ప్రత్యక్ష, పరోక్షంగా శ్రమించారన్నారు. పార్టీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తల శ్రమతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేది గమనించాలి. అందరికి కూడా అంతే ప్రాముఖ్యత లభించాలన్నారు. కీర్తిని కొందరే తీసుకోవడాన్ని ఆమోదించను అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ సముదాయంవారే ముఖ్యమైన ఓటర్లు. అందుచేత ఆ సముదాయాలకు ప్రాతినిధ్యం లభించాలన్నారు.


