రైలు ప్రమాదానికి కుట్ర
దొడ్డబళ్లాపురం: రైలు పట్టాలపై ఇనుప కడ్డీని అడ్డంగా పెట్టి పట్టాలు తప్పించడానికి ఎవరో దుండగులు కుట్ర చేసిన సంఘటన చెన్నపట్టణ వద్ద శనివారం రాత్రి జరిగింది. లోకో పైలట్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. మైసూరు నుంచి బెంగళూరుకు వస్తున్న హంపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌కి రాడ్ అడ్డుపడింది. దీన్ని గమనించిన లోకోపైలట్ వెంటనే రైలు నిలిపివేశాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముందుజాగ్రత్తగా మరో ఇంజిన్ తీసుకువచ్చి రైలుకు అమర్చి పంపించారు. ప్రమాదానికి కుట్ర పన్నిన వారి కోసం గాలింపు చేపట్టారు.
పిచ్చికుక్క దాడి,
నలుగురికి గాయాలు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట పిచ్చికుక్కల దాడులు జరుగుతున్నాయి. ఈదఫా నలుగురు గాయపడ్డ సంఘటన దొడ్డ తాలూకా తపసీహళ్లిలో జరిగింది. ఆదివారం ఉదయం 6గంటల సమయంలో గ్రామంలో రెండు మేకలపై దాడిచేసిన పిచ్చికుక్క తపసీహళ్లి గేట్ వద్ద నలుగురిని కరిచింది. వారికి రక్తగాయాలయ్యాయి. బాధితులను దొడ్డ పట్టణ ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్క దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
వారు ఆదర్శ పురుషులా?
సాక్షి బెంగళూరు: రామాయణ మహాకావ్యంలోని శ్రీరాముడు, లక్ష్మణుడు, రావణాసురుడు ఆదర్శ వ్యక్తులు కాదని, క్రూరులని రచయిత్రి బీటీ లలితా నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దావణగెరె ఏవీకే మహిళా కాలేజీలో జరిగిన కన్నడ సాహిత్య మహిళా సంవాద కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. శూర్పణక ముక్కు కత్తిరించిన లక్ష్మణుడు, సీతను అనుమానించి నిర్జన ప్రాంతంలో ఉంచిన శ్రీరాముడు ఆదర్శవంతులు ఎలా అవుతారని అన్నారు. సీతమ్మను చెరబట్టిన రావణాసురుడు కూడా క్రూరుడని , భక్తి పేరిట వారిని ఆదర్శవంతులుగా ప్రతిబింబించడం సరికాదన్నారు.
కమిషనర్‌పై
మరో అధికారి దాడి
మైసూరు: మైసూరులోని హోటెహళ్ళి నగరసభ కమిషనర్ పైన పురసభ ముఖ్యాధికారి అనుచరులతో దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. వివరాలు.. జిల్లోని పిరియా పట్టణ పురసభ ముఖ్యాధికారి మధు, స్నేహితుడు సంజయ్‌గౌడతో పాటు ముగ్గురు తన పైన దాడి చేసినట్లు హోటెగళ్ళి నగరసభ కమిషనర్ అయిన బీ.ఎన్.చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న సాయంత్రం మైసూరు సిటీ సరస్వతిపురం ఠాణా పరిధిలో కారులో వెళ్తుండగా మధు, మిత్రులు వచ్చి దాడి చేశారు, నాతో పెటుకుంటే నీ పని అయిపోతుంది, నిన్ను లేకుండా చేస్తానని హెచ్చరించాడని ఫిర్యాదులో తెలిపారు. ఉద్యోగ సంబంధ గొడవలే కారణమని అనుమానాలున్నాయి.
రియల్టర్ కిడ్నాప్..
రూ.5 కోట్లు డిమాండ్
● దుండగుల పట్టివేత
హోసూరు: హోసూరు సమీపంలో రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ రియల్టర్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని హడ్కో పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు సూళగిరి తాలూకా మాదరసనపల్లివాసి సీతారామన్ (35), అత్తిముగంలో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తూ రియల్టర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం హోసూరకు ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆస్తి విక్రయం గురించి మాట్లాడాలని హోసూరుకు పిలిచింది. బత్తలపల్లి ప్రాంతంలో మహిళతో చర్చించి కారులో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు. రహస్య స్థలంలో బంధించి కొట్టి, తమకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీవ్ర భయాందోళనకు గురైన సీతారామన్ మిత్రునికి ఫోన్ చేసి చెప్పాడు, అతడు పోలీసులకు సమాచారం అందజేశాడు. సీతారామన్ కుటుంబసభ్యులు హడ్కో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కసవుగట్ట ప్రాంతంలో బంధించి ఉంచినట్లు తెలుసుకొని విముక్తి కల్పించారు. నిందితులు హోసూరు సమీపంలోని మోర్నపల్లికి చెందిన శంకర్ (38), బత్తలపల్లి గణేష్ (40), తిరుపత్తూరు జిల్లా కందిలికి చెందిన అజయ్ (19), గోకులకణ్ణన్ (23)లను అరెస్ట్ చేశారు. కిడ్నాప్ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.


