జల్సాలు.. వ్యసనాలు.. చివరకు దోపిడీ
బనశంకరి: జల్సాలు చేసి, ఆ అప్పుల్ని తీర్చడానికి దోపిడీకి తెగబడి కటకటాలు లెక్కిస్తున్నారు. గత బుధవారం బెంగళూరు డైరీ సర్కిల్ ఫ్లై ఓవర్ మీద ఏటీఎం నగదు రవాణా వాహనం నుంచి రూ. 7.11 కోట్ల దోపిడీ కేసులో మరో దోపిడీదారుడు రాకేశ్ శనివారం అర్ధరాత్రి స్థానిక సిద్దాపుర పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. దోపిడీ మాస్టర్‌మైండ్ క్లెవియర్‌తో పాటు అందరూ విలాసవంతమైన జీవితం, జూదం, ఇతరత్రా వ్యసనాలకు అలవాటుపడి అప్పులుచేశారు. అప్పులు ఎలాగైనా తీర్చాలని ఏటీఎం నగదు వాహనం దోపిడీకి పాల్పడ్డారు. సీఎంఎస్ వాహనం పర్యవేక్షకుడు గోపి, క్లెవియర్ కు నెలకు రూ.17 వేల జీతం వస్తుంది. క్లెవియర్ ఏడాది క్రితం ఉద్యోగం మానేసి, వ్యవసనాలతో ఇబ్బందుల పాలయ్యాడు. వీరికి పోలీస్‌కానిస్టేబుల్ అణ్ణప్పనాయక్ మిత్రుడు, అందరూ ప్లాన్ ప్రకారం ఏటీఎం నగదు వాహనం లూటీ చేశారు. గోపీ ప్రధాన సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మరో నిందితుడు రవి ఎమ్మెస్సీ చదివాడు, తన ట్రావెల్స్ ఏజెన్సీలో నష్టాలు రావడంతో దోపిడీకి సై అన్నాడు. రవి భార్య ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలను చెప్పింది, రవితో పాటు అతని తండ్రి (మాజీ జవాన్), సోదరుని పాత్ర గురించి విచారణ సాగుతోంది. గోపి, క్లెవియర్, అణ్ణప్పనాయక్, రవి, నవీన్, నెల్సన్, రాకేశ్ ఇప్పటివరకు దొరికారు.
ఆ పోలీస్ సస్పెండ్
కానిస్టేబుల్ అణ్ణప్పనాయక్ ను ఆదివారం పోలీసు ఉన్నతాధికారు సస్పెండ్ చేశారు. ఇతడు గోవిందపుర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. కోరమంగల పరిధిలో కాల్‌సెంటరు ఉద్యోగులను కిడ్నాప్ చేసిన కేసులో కోలారు కానిస్టేబుల్ పాత్ర బయటపడడంతో హోంమంత్రి పరమేశ్వర్ ఆగ్రహం వెలిబుచ్చారు. బెంగళూరులో భారీ నేరాల్లో పోలీసులు కుమ్మక్కు కావడం పట్ల నెటిజన్లు సైతం విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సినవారే నేరగాళ్లతో ములాఖత్ అవుతున్నారని మండిపడ్డారు.
ఏటీఎం వాహనం లూటీ కేసులో
నిందితుల నేపథ్యమిదీ
మరో నిందితుడు లొంగుబాటు
బెంగళూరుకే చెడ్డపేరు
దోపిడీ ఘటనపై హోంమంత్రి
శివాజీనగర: బెంగళూరులోని ఏటీఎం వాహనం నుంచి రూ7.11 కోట్ల దోపిడీ కేసులో ఏడు మంది నిందితులను బెంగళూరు నగర పోలీసులు పట్టుకొన్నారు. మరికొందరు చిక్కాల్సి ఉంది. నిందితుల్లో ఓ పోలీసు ఉన్నాడు అని హోమ్ మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆదివారం సదాశివనగర నివాసంలో నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్, ఇతర అధికారులతో ఆయన భేటీ అయ్యారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. కేసును ఛేదించినందుకు అభినందించినట్లు చెప్పారు. ఈ దోపిడీని చూస్తే ఎవరిని నమ్మాలో తెలియదు, బెంగళూరుకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా జరిగింది. సాంకేతికంగా, చాలా జాగ్రత్తతో తెలివిగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికి రూ.6.29 కోట్లు రికవరీ అయ్యింది అని చెప్పారు. దోపిడిలో ఇంకా ఎవరైనా పోలీసులకు సంబంధముంటే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు. నగదు తరలింపులో సీఎంఎస్ సంస్థ ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటిస్తున్నారా, లేదా అనేది తనిఖీ చేస్తామన్నారు.
జల్సాలు.. వ్యసనాలు.. చివరకు దోపిడీ


