యశవంతపుర: కన్నడ బిగ్‌బాస్ నిర్వాహకుడు కిచ్చ సుదీప్, పోటీదారు అశ్వనిగౌడపై సంధ్యా పవిత్ర అనే ఆమె మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నా కోపం తల నుంచి తోకకు చేరిందని సుదీప్ రక్షితాశెట్టిపై షొలో ఆక్రోశం వ్యక్తం చేశారని, సుదీప్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉందంటూ సంధ్యా పవిత్ర ఫిర్యాదు చేశారు. అదేవిధంగా బిడిది పోలీస్‌స్టేషన్‌లో కూడా సుదీప్‌పై ఫిర్యాదు చేశారు. రక్షితాశెట్టిని ఎస్ కేటగిరి, ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా అంటూ పోటీదారు అశ్వినిగౌడ నిందించారని ఆరోపిస్తూ మహిళా కమిషన్‌కు సంధ్యా ఫిర్యాదు చేశారు. సుదీప్‌పై ఫిర్యాదు చేయగానే అతని అభిమానులు తనపై దౌర్జన్యానికి దిగారని సంధ్యా అవేదన వ్యక్తం చేశారు.
మరణంలోనూ పునర్జన్మ
యశవంతపుర: ఓ వ్యక్తి తాను మరణించినా అవయవదానంతో పలువురికి పునర్జన్మ ఇచ్చాడు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈఘటన హాసన జిల్లాలో జరిగింది. హాసన జిల్లా ఆలూరు తాలూకా కిత్తగళలె గ్రామానికి చెందిన దొడ్డయ్య, నింగమ్మల కుమారుడు నాగరాజు(33) ఈ నెల 19న బైకు ప్రమదానికి గురయ్యాడు. బెంగళూరు ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.అవయవదానం చేస్తే పలువురికి పునర్జన్మ ఇవ్వవచ్చని వైద్యులు మృతుడి తల్లిదండ్రులకు సూచించారు. కుమారుడు మరణించిన దుఃఖంలోనూ వారు అవయవ దానానికి అంగీకరించారు. దీంతో నాగరాజుకు చెందిన పలు అవయవాలను వైద్యులు సేకరించి అవసరమైన వారికి అమర్చారు.
జైలుకు వెళ్లి పరామర్శ
శివాజీనగర: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వైఖరి కుతూహలానికి దారితీసింది. ఎందుకంటే హఠాత్తుగా పరప్పన అగ్రహారం వైపు తరిలారు. జైలులో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పరామర్శించారు. హత్య కేసుకు సంబంధించి ధార్వాడకు చెందిన వినయ్ కులకర్ణి, అక్రమ సొమ్మ బదిలీ కేసులో వీరేంద్ర పప్పి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన వీరిద్దరినీ పరామర్శించారు. కాంగ్రెస్ సర్కార్‌లో అధికార మార్పిడి జరిగితే రెండు వర్గాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ముఖ్యమవుతోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు డీకే శివకుమార్ ఇద్దరు ఎమ్మెల్యేలతో చర్చించేందుకు జైలుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
చిన్నారి జలసమాధి
యశవంతపుర: ఈత కొలనులో పడి ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా భట్కళ తాలూకాలో జరిగింది. మదరసాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మౌలానీ షాహిదుల్లా కుటుంబం భట్కళలోని జాలీ బీచ్ రిసార్ట్‌కు వెళ్లింది. షాహిదుల్లా కుమార్తె ముస్తకీం(5) తన తల్లి, తమ్ముడి జతలో కాలి నడకన వెళ్తుండగా కాలు జారి ఈత కొలనులో పడిపోయింది. కుమార్తెను రక్షించేందుకు తల్లి యత్నించినా ఫలితం లేకపోయింది. భట్కళ రూరల్ మపోలీసులు వచ్చి గాలించగా చిన్నారి విగతజీవిగా కనిపించింది. కేసు దర్యాప్తులో ఉంది.
నోరుమెదిపే వారిని హెచ్చరించాం
●రణదీప్ సింగ్ సుర్జేవాలా
శివాజీనగర: నాయకత్వ మార్పుపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న పార్టీ నాయకులను హెచ్చరించామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కర్ణాటక సీఎం, డీసీఎంతో మాట్లాడతాను. కర్ణాటక బీజేపీ, కొంత మంది మీడియావారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకకు చెడ్డ పేరు తెచ్చే కుట్ర చేయడాన్ని ఉభయ నాయకులు ఆమోదించారని రాసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ సాధనలు, పంచ గ్యారెంటీలు విజయవంతం కావటాన్ని బలహీనపరచే ఉద్దేశ్యంతో కుట్ర రూపొందించారని సుర్జేవాలా ఆరోపించారు. నాయకత్వంపై అప ప్రచారం చేయరాదని, అజెండాకు భంగం కల్గించరాదని హెచ్చరించాం. పార్టీలో నాయకుల అభిప్రాయాలను హైకమాండ్ పరిగణించిందని తెలిపారు.


