దోపిడీ కేసులో వీడిన మిస్టరీ
బనశంకరి: బెంగళూరు డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ రోడ్డులో పట్టపగలే సీఎంఎస్ ఏటీఎం వాహనంలో రూ.7.11 కోట్ల నగదు దోపిడీ కేసును ఛేదించడంలో నగర పోలీసులు సఫలీకృతులయ్యారు. ముగ్గురు నిందితులు చైన్నెలో పట్టుబడగా గోవిందపుర పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ అణ్ణప్పనాయక్, కేరళకు చెందిన డేవియర్ అనే నిందితులను బెంగళూరులో శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులను నుంచి రూ.6.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి వాడిన ఇన్నోవా కారును చిత్తూరు వద్ద పసిగట్టిన పోలీస్ బృందాలు ఈ కేసులో మిగిలిన వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కేసు నమోదైన వెంటనే దోపిడీదారుల వెంటపడిన పోలీసులు చిత్తూరులో ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. దానిని బెంగళూరుకు తీసుకువచ్చి పరిశీలించగా యూపీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ప్లేట్ అమర్చిన దోపిడీ ముఠా పారిపోయినట్లు గుర్తించారు. దోపిడీదారులకు ఇన్నోవా కారు ఇచ్చిన ఇద్దరిని ఇంజిన్ ఛాసీ నెంబరు ఆధారంగా నగర పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా మరింత సమాచారం వెలుగులోకి రావడంతో దర్యాప్తు తీవ్రతరం చేశారు.
కుట్ర పన్నింది ఆ ఇద్దరే
గోవిందపుర పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ అణ్ణప్పనాయక్, కేరళకు చెందిన డేవియర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ గ్యాంగ్‌లో కానిస్టేబుల్ అణ్ణప్పనాయక్ మాత్రమే కాకుండా సీఎంఎస్ మాజీ ఉద్యోగి కూడా భాగస్వామి అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. సీఎంఎస్‌లో గతంలో పని చేసిన డీవియర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా ఏడాది క్రితం సీఎంఎస్‌లో ఉద్యోగం వదిలి పెట్టినట్లు తెలిసింది. బాణసవాడి పోలీస్ స్టేషన్‌లో క్రైంబీట్ చూస్తున్న కానిస్టేబుల్ అణ్ణప్పనాయక్‌ను హొయ్సళకు బదిలీ చేశారు. అక్కడ పని లేకపోవడంతో అణ్ణప్పనాయక్, డీవియర్ ఇద్దరూ ప్రతిరోజు కలుసుకుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో సీఎంఎస్ నగదు రవాణాతో పాటు అన్ని విషయాలను అణ్ణప్పనాయక్‌కు డీవియర్ వివరించాడు.
పక్కా ప్లాన్ ప్రకారమే దోపిడీ
అలా నగదు దోపిడీకి కుట్రపన్ని సీఎంఎస్ నగదు దోచేయడం, పారిపోవడం అనే పక్కాప్లాన్‌ను జేవియర్ అణ్ణప్పనాయక్‌కు తెలిపాడు. ఆ మేరకు పక్కా ప్లాన్ ప్రకారం నగదు తరలిస్తున్న సీఎంఎస్ వాహనాన్ని అడ్డుకుని రూ.7.11 కోట్ల నగదు దోచుకుని ఉడాయించారు. కానీ దోపిడీ సమయంలో మాస్టర్‌మైండ్స్ జేవియర్, అణ్ణప్పనాయక్‌లు అక్కడికి వెళ్లలేదు. దీనికి బదులుగా నగదు దోపిడీ ఎలా చేయాలి? ఎలా తప్పించుకుని పారిపోవాలి? అనే విషయాలపై రూట్‌మ్యాప్ ప్రకారం కార్యాచరణ ప్రణాళికరూపొందించి ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఐదుగురు నిందితుల అరెస్ట్
రూ.6.3 కోట్ల సొమ్ము స్వాధీనం


