దిగుమతులతోనే మొక్కజొన్న ధరల పతనం
● రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వ నిర్ణయం
శివాజీనగర: మొక్కజొన్న ధర భారీగా తగ్గి రైతులు భారీగా నష్టపోతున్న నేపథ్యంలో విదేశాలనుంచి మొక్కజొన్న దిగుమతులు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం కావేరి నివాసంలో మంత్రులు, అధికారులతో సమావేశమై మాట్లాడారు. మొక్కజొన్న రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇథనాల్ తయారీ కోసం రైతులనుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిస్టరీలను కోరుతామన్నారు. దేశంలో మొక్కజొన్న దిగుబడులు భారీగా పెరిగినా కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి 70 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటోందన్నారు. దిగుమతును ఆపివేసి మొక్కజొన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. మొక్కజొన్నతో ఇథనాల్ తయారీకి కేంద్రం రాష్ట్రానికి నిర్ధారించిన కోటా అత్యంత తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతానికి 8 లక్షల టన్నుల మొక్కజొన్నను ఏజెన్సీలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. మంత్రులు హెచ్.కే.పాటిల్, కే.హెచ్.మునియప్ప, శివానంద పాటిల్, కే.వెంకటేశ్, సీఎం రాజకీయ కార్యదర్శి నజీర్ అహమ్మద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజనీశ్, అదనపు ప్రధానకార్యదర్శి అంజుం పర్వేజ్ పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటాం
మైసూరు : మొక్కజొన్న రైతులను ఆదుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. మద్దతు ధర ప్రకారం మొక్కజొన్నకు రూ. 2400 ధర ఉందన్నారు. అయితే మార్కెట్‌లో ధర తగ్గిందని, దీంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారన్నారు. మంత్రులు, అధికారులతో చర్చించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.


