సగం చలానా చెల్లిస్తే చాలు
శివాజీనగర: రోడ్లపై తిరుగుతున్న అనేక వాహనాలపై చలానాలు ఉంటాయి. తనిఖీలలో పట్టుబడితే చలానా కట్టేవరకూ వాహనం సీజ్ చేస్తామని హెచ్చరిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలపై 50 శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సదుపాయం శుక్రవారం నుంచి డిసెంబర్ 12 వరకు అమల్లో ఉంటుంది. ఈ కాలావధిలో అన్ని రకాల వాహనదారులు తమ పెండింగ్ జరిమానాలను సగం మొత్తం చెల్లించి పరిష్కరించుకోవచ్చు. ఇటీవల కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు వేలాది మంది ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో క్యూ కట్టి చెల్లించారు. దీంతో సర్కారుకు కోట్లాది రూపాయల ఆదాయం ఖజానాకు చేరింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆఫర్‌ను ప్రకటించింది. ఈసారి కూడా పెద్దమొత్తంలో రాబడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఎక్కడ చెల్లించాలి?
జరిమానా చెల్లింపులు బెంగళూరులోలో అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లు, ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం, కర్ణాటక వన్, బెంగళూరు వన్ వెబ్‌సైట్‌లలో వివరాలు పొంది చెల్లించవచ్చు. జిల్లాల్లో అయితే సమీప పోలీస్ స్టేషన్‌లకు వెళ్లి చెల్లించవచ్చని చెప్పారు. కర్ణాటక స్టేట్ పోలీస్ (కేఎస్‌పీ) యాప్‌లోనూ చెల్లించే వసతి ఉందని అధికారులు తెలిపారు.
రూ.వందల కోట్ల పెండింగ్
ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనల కేసుల్లో వందలాది కోట్ల రూపాయల జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయి. బెంగళూరులో కొందరు ద్విచక్ర వాహనదారులపై 40, 50 కి పైగా చలానాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది, అలాంటివారు కనీసం రూ.30, 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సగం చెల్లిస్తే చలానాలన్నీ మాఫీ అవుతాయి. ప్రభుత్వం 2023లో తొలిసారిగా 50 శాతం రాయితీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ స్కీం ద్వారా రూ.120 కోట్ల రూపాయలకు పైగా వసూలయ్యాయి.
వాహనదారులకు మళ్లీ సబ్సిడీ ఆఫర్
నేటి నుంచి డిసెంబరు 12 వరకు అమలు
సగం చలానా చెల్లిస్తే చాలు


