కుక్క కరిస్తే రూ.5 వేలు, మరణిస్తే రూ.5 లక్షలు
శివాజీనగర: బెంగళూరు పరిధిలో వీధి కుక్కల దాడిలో గాయపడటం, రేబీస్‌తో మరణించినవారికి పరిహార మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం నవీకరించి విడుదల చేసింది. ఇక నుంచి కుక్క కాటు వల్ల గాయాలు, లేదా మూగదెబ్బలు తగిలిన బాధితులకు రూ.5 వేల వరకు ఆయా పంచాయతీ, మున్సిపల్ అధికారులు పరిహారాన్ని ఇస్తారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కుక్క కరిచిన వ్యక్తికి తక్షణమే వైద్య సదుపాయాలు లభించాలని అందులో ఆదేశించారు. ఆ సొమ్మును ప్రభుత్వం ఓ ట్రస్టు ద్వారా చెల్లిస్తుంది. కుక్కల దాడి, రేబీస్ ద్వారా వ్యక్తి చనిపోతే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తారు. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు అధికమయ్యాయి. కుక్కల జోరుకు అడ్డుకట్ట వేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు అనేక సందర్భాలో ప్రభుత్వాలను ఆదేశించడం తెలిసిందే.
చిల్లర గొడవ.. జిల్లాలోనే రచ్చ
● నిందితుల అరెస్టు
శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని ఆర్‌ఎంఎల్ నగర మార్నామి బయలులో హరీష్ అనే యువకునిపై దాడి కేసులో ముగ్గురు నిందితులను దొడ్డపేటె స్టేషన్ పోలీసులు బంధించారు. బుద్ధనగర నివాసులు అర్మాన్ (21), సీగేపట్టి బడావణె నివాసి నిరంజన్ (20), 17 ఏళ్ల మైనర్ బాలుడు పట్టుబడిన నిందితులు. హరీష్‌పై దాడి కేసు రాజకీయ హైడ్రామాకు తెరతీసింది. ఇతర మతస్తులు హ రీష్‌పై దాడి చేశారని ఓ వర్గంవారు ఆరోపించారు. ఎమ్మెల్యే చెన్నబసప్ప పోలీసులపై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. మరో వైపు దేశభక్తుల బళగ సంఘం ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హరీష్‌పై జరిగిన దాడి సీసీ కెమెరా వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. నిందితుల్లో ఒకరు తప్ప ఇతర ఇద్దరు అదే మతం వారని తేలింది. తాము రోడ్డుపై వెళ్తుండగా హరీష్ కోపంగా చూడడంతో కొట్టినట్లు నిందితులు చెప్పారు. చిన్న గొడవ జిల్లాలో పెద్ద రచ్చకు కారణమైంది.
తండ్రి అప్పు తీర్చలేదని.. కూతురిపై అత్యాచారం
యశవంతపుర: తండ్రి చేసిన అప్పును తీర్చనందుకు 10 ఏళ్ల కూతురి మీద దుండగుడు అత్యాచారానికి పాల్పడిన కిరాతక సంఘటన ఉత్తర కన్నడ జిల్లా శిరసిలో జరిగింది. దుండుగుడు మతీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. బాలిక తండ్రి, మతీన్ నడిపే సంఘం నుంచి అప్పు తీసుకున్నాడు. కొన్ని నెలలుగా కంతులు కట్టడం లేదు. ఇచ్చిన డబ్బులు చెల్లించాలని మతీన్ ఆయన ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తండ్రి ఇంటి వద్ద లేరు. బాలిక ఒక్కరే ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా, మీ తండ్రి ఎక్కడని మతీన్ ప్రశ్నించాడు. లేడని చెప్పగా, బాలికను ఇంటిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి పరారయ్యాడు. తండ్రి వచ్చాక దారుణాన్ని చెప్పింది, దీంతో శిరసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల పుర్రె కేసులో చార్జిషీటు
బనశంకరి: ధర్మస్థలలో మృతదేహాలను పూడ్చిపెట్టారంటూ చిన్నయ్య అనే వ్యక్తి ఓ తలపుర్రెను తీసుకొచ్చి దుష్ప్రచారం చేసిన కేసులో సిట్ అధికారులు బెళ్తంగడి తాలూకాకోర్టులో గురువారం చార్జిషీటు దాఖలు చేశారు. 3,923 పేజీలతో ఉంది. ఈ కుట్రలో చిన్నయ్య తో పాటు ఆరుమంది భాగస్వాములని పేర్కొన్నారు. వారు చిన్నయ్య, మహేశ్‌శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్, జయంత్, విఠల్‌గౌడ, సుజాతాభట్ అని తెలిపారు.


