టూరిస్టు బస్సు పల్టీ.. 22 మందికి గాయాలు
శివమొగ్గ: అదుపు తప్పిన ఓ మినీ టూరిస్ట్ బస్సు బోల్తా పడటంతో 22 మంది గాయపడిన ఘటన శివమొగ్గ తాలూకా కెళగిన కుంచేనహళ్లి గ్రామంలో శివమొగ్గ–శికారిపుర రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా తరీకెరెకు చెందిన యాత్రికులు ధార్మిక క్షేత్రం మైలారలింగస్వామి ఆలయానికి వెళ్లి తిరుగుముఖం పట్టారు. హఠాత్తుగా ఆవు అడ్డు రావడంతో దానిని తప్పించబోయి డ్రైవర్ అదుపు తప్పిన మినీ బస్సు బోల్తా పడింది. స్థానికులు, గ్రామస్తులు చేరుకుని బస్సులోనివారిని బయటకు తీశారు. గాయపడిన వారిలో మహిళ, పిల్లలున్నారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. శివమొగ్గ మెగ్గాన్ ఆస్పత్రితో పాటు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. డీఎస్పీ సంజీవ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర చేరుకుని పరిశీలించారు.
లైంగిక దాడి కేసులో
20 ఏళ్ల జైలు
శివమొగ్గ: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ.65 వేల జరిమానా విధిస్తూ శివమొగ్గ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. వివరాలు.. జిల్లాలోని భద్రావతి తాలూకాకు చెందిన నిందితుడు (30) 2022లో 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై భద్రావతి హళేనగర పోలీసు స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. భద్రావతి సీఐ రాఘవేంద్ర కేసు దర్యాప్తు చేపట్టి నిందితునిపై కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి నింగనగౌడ పాటిల్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం బాధితురాలికి రూ.4.50 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.
కామాంధ రేడియాలజిస్ట్ అరెస్ట్
బనశంకరి: ఇటీవల బెంగళూరు నగర జిల్లా ఆనేకల్‌లో డయాగ్నస్టిక్ సెంటర్‌లో స్కానింగ్ చేసుకోవడానికి వెళ్లిన మహిళను అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడిన కామాంధ రేడియాలజిస్ట్ జయకుమార్‌ను ఎట్టకేలకు గురువారం పోలీసులు అరెస్ట్‌చేశారు. జయకుమార్ ను అరెస్ట్ చేయాలని బుధవారం అనేకల్‌లో కర్ణాటక రక్షణవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోకేశ్‌గౌడ నేతృత్వంలో ధర్నా చేశారు. సీఐ తిప్పేస్వామి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి పదిరోజులైనప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. జయకుమార్‌ను అరెస్ట్ చేయకపోతే ఆనేకల్ బంద్ చేస్తామని హెచ్చరించారు. దీంతో అరెస్ట్ చేశారు.
చైన్ స్నాచింగ్..
మహిళకు గాయాలు
మైసూరు: ఓ మహిళ మెడలోని 35 గ్రాముల బంగారు గొలుసును దుండగులు దోచుకొన్నారు. టీ.నరసీపుర తాలూకా కై య్యంబళ్లి గ్రామం వద్ద జరిగింది. గ్రామ నివాసి బసవరాజు, భార్య పవిత్రతో టీవీఎస్ మోపెడ్‌లో పొరుగూరికి వెళ్లి తిరిగి వస్తుండగా కోణగహళ్లి గేట్ మీదుగా పల్సర్ బైక్‌లో వెంబడించిన ఇద్దరు దుండగులు పవిత్ర మెడలోని మాంగల్యం గొలుసును లాక్కొని ఉడాయించారు. ఈ రభసకు దంపతులు మోపెడ్‌పై నుంచి కిందకు పడటంతో పవిత్రకు స్వల్ప గాయాలయ్యాయి. గొలుసు దొంగలిద్దరూ హెల్మెట్ ధరించి ఉన్నారు. ఎస్‌ఐ జగదీష్ ధూళ్‌శెట్టి, ఇన్‌స్పెక్టర్ ధనంజయ పరిశీలించి స్నాచర్ల కోసం గాలింపు చేపట్టారు.


