ప్రజా దీవెన ఉన్నంతకాలం నేనే సీఎం
శివాజీనగర: నాకు మూఢ నమ్మకాలపై విశ్వాసం లేదు. చామరాజనగరైనా, మైసూరైనా ఒక్కటే. ఇక్కడికి వచ్చినపుడు నాకు అధికారం భద్రమైంది అని సీఎం సిద్దరామయ్య అన్నారు. గురువారం చామరాజనగరలో అఖిల భారత సహకార ఉత్సవాల ముగింపులో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ తన స్థానం ఇప్పటికీ భద్రంగానే ఉంది, మునుముందు కూడా అలాగే ఉంటుందని సీఎం మార్పు వార్తలను ప్రస్తావిస్తూ అన్నారు. రెండున్నర సంవత్సరాల అయిన తరువాత మంత్రిమండలిని పునర్‌వ్యవస్థీకరించాలని అన్నాను. దానినే కొందరు క్రాంతి అంటున్నారు, అయితే ఏ క్రాంతి లేదు, భ్రాంతి కూడా లేదు అని చెప్పారు. మళ్లీ రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తాం. ఎప్పటి వరకు ప్రజల ఆశీర్వాదం ఉంటుందో, అప్పటి వరకు నేనే సీఎంగా ఉంటాను అని చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు అనేది లేదని ఆయన పరోక్షంగా ప్రత్యర్థులకు చాటిచెప్పారు. కాగా రాష్ట్రం నుంచి కేంద్రానికి అధిక జీఎస్‌టీ వెళ్తోంది, కానీ సక్రమంగా తిరిగి ఇవ్వడం లేదు. ఎక్కువ నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు.
జేడీఎస్‌లో అడ్డుకునేవారు
తాను జేడీఎస్ పార్టీలోనే ఉండి ఉంటే సీఎం అయ్యేవాడిని కాదని సిద్దరామయ్య అన్నారు. దేవేగౌడ, ఆయన కుమారులు ఆ అవకాశం ఇచ్చేవారు కాదన్నారు. నెహ్రూ దూరదృష్టి వల్ల దేశంలో సహకార సంఘాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం, పాడి, పరిశ్రమలు, బ్యాంకింగ్ ఇలా పలు రంగాల్లో సహకార సంఘాలు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
క్రాంతి, భ్రాంతి ఏదీ లేదు
చామరాజనగరలో సీఎం సిద్దు
కుర్చీ మార్పు లేదని స్పష్టీకరణ


