
అత్యున్నత సాధనకు చదువు ఒక్కటే మార్గం
హుబ్లీ: అత్యున్నత సాధనకు చదువు ఒక్కటే మార్గం అని విధాన పరిషత్ చీఫ్ విప్ సలీం అహ్మద్ తెలిపారు. గదగ్ కనక భవనలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగుల క్షేమాభివృద్ధి సంఘం గదగ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2024–25వ సంవత్సరానికి 10వ తరగతి, పీయూసీలో ఎక్కువ మార్కులు సాధించిన ముస్లిం సమాజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, విశ్రాంత ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 95 శాతం పోటీ ప్రపంచంలో ఎంత ప్రతిభ ఉన్నా తక్కువే అన్నారు. ప్రతిభతో పాటు నైపుణ్యం తదితరాలను అలవరుచుకొన్నవారికే చక్కటి అవకాశాలు లభిస్తాయన్నారు. మైనార్టీల అత్యధిక ఓట్ల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిందన్నారు. ఇచ్చిన హామీల మేరకు పార్టీ నడుచుకుందన్నారు. సూడిజుత్తి హిరేమఠ డాక్టర్ కొట్టూరు బసవేశ్వర శివాచార్య మాట్లాడుతూ నిరంతర సాధనతో విద్య సాకారం అవుతుందన్నారు. సాధన చేస్తే సాధ్యం కానిదన్నదే లేదన్నారు. అయితే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. పిల్లలకు ఆస్తి సంపాదన చేయకండి, బదులుగా పిల్లలనే ఆస్తిగా తీర్చిదిద్దాలని ఆయన తల్లిదండ్రులకు హితవు చెప్పారు. పురస్కారాలు అందుకున్న విద్యార్థులు తమ ప్రతిభకు నిత్యం పదును పెడుతూ ముందంజలో సాగాలన్నారు. మహేశ్వర స్వామి మౌలానా ఇనాయత్ ముల్లా, డాక్టర్ సీఎం.రఫీ, గదగ్ ప్రాధికార అధ్యక్షుడు అక్బర్‌సాబ్, హుమయూన్, డీఎస్పీ ముర్తుజా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రత్యేక ప్రసంగం చేశారు. ప్రతిభావంత విద్యార్థులు ప్రతిభా పురస్కారాలతో పాటు విశ్రాంత ముస్లిం ఉద్యోగులకు ఘన సన్మానం, సాధకులను ఘనంగా సన్మానించారు.