
నమ్మించి.. ప్రాణం తీశారు
గౌరిబిదనూరు: అందరూ స్నేహితులే. కానీ బంగారాన్ని చూసి దుర్బుద్ధి పుట్టి రాక్షసులుగా మారారు. ఇటీవల అపరిచిత మహిళ మృతదేహం కేసులో ఓ యువకుడు, యువతిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. సమీపంలో ఏపీలోని హిందూపురం వద్దనున్న శ్రీకంఠాపురానికి చెందిన వడ్డే అర్చన (27) అనే వివాహిత క్యాటరింగ్ పని చేసేది. పనికి వెళ్తున్నానని చెప్పి 14వ తేదీ ఇంటి నుంచి బయలు దేరింది. ఒక రోజైనా ఇంటికి తిరిగి రాక పోవడంతో హిందూపురం పోలీసు స్టేషనులో అర్చన భర్త మిస్సింగ్ కేసు పెట్టాడు.
చున్నీతో గొంతు నులిమి..
అర్చనకు కేటరింగ్ పనిలో బెంగుళూరుకు చెందిన రాకేశ్, అంజలిలతో పరిచయం ఏర్పడింది. అందరూ ఆప్త స్నేహితులుగా మెలిగేవారు. హిందూపురం, బెంగళూరులో ఎక్కడ కేటరింగ్ పనులు ఉన్నా కలిసి వెళ్లేవారు. అయితే ఆర్థిక సమస్యల్లో ఉన్న రాకేశ్‌కు అర్చన ధరించే బంగారు నగలపై ఆశ పుట్టింది. 14న అర్చనను పని ఉందని పిలిపించిన రాకేశ్, అంజలి.. కారులో గౌరిబిదనూరు, చిలమత్తూరు, లేపాక్షి, పెరేసంద్ర మొదలైన చోట్ల తిప్పి చివరకు నామగొండ్లు సమీపంలో చున్నీతో ఆమెను హత్య చేశారు, ఆమె మెడలోని బంగారు చైన్లను తీసుకుని శవాన్ని అక్కడే ఓ వంతెన కింద పారవేశారు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టరాదని బండరాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి ఉడాయించారు. బంగారాన్ని రూ. 1.95 లక్షలకు కుదువపెట్టిన రాకేశ్.. తన ఆటోకు రుణం కంతును చెల్లించాడు.
పరారీలో డ్రైవర్, మరో యువతి
ఈ నేపథ్యంలో స్థానిక మంచేనహళ్లి పోలీసులు ముమ్మరంగా గాలింపు జరిపారు. 17వ తేదీన మృతదేహం లభించింది, ఆరా తీసి మృతురాలు అర్చన అని గుర్తించారు. ఆమెకు వచ్చిన కాల్స్ ఆధారంగా నిందితుడు రాకేశ్‌ను, హత్యలో ఇతనికి సహాయపడిన అంజలిని మంచేనహళ్ళి పోలీసులు అరెస్టు చేసి బంగారు నగలను స్వాధీన పరచుకొన్నారు. వీరికి సహకరించిన కారు డ్రైవర్ నవీన్, మరో నిందితురాలు నీహారిక పరారీలో ఉన్నారు.
నిందితుడు రాకేశ్ నిందితురాలు అంజలి
బంగారం కోసం స్నేహితురాలి హత్య
హిందూపురం మహిళ మృతదేహం కేసులో వీడిన మిస్టరీ
యువకుడు, యువతి అరెస్టు

నమ్మించి.. ప్రాణం తీశారు

నమ్మించి.. ప్రాణం తీశారు

నమ్మించి.. ప్రాణం తీశారు