
తహసీల్దారు ఆఫీసును గొర్రెలతో ముట్టడి
దొడ్డబళ్లాపురం: గోమాళ భూమిలో ప్రభుత్వ కట్టడం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు వందలాది మేకలు, గొర్రెలతో తహసీల్దార్ ఆఫీసును ముట్టడించారు. దావణగెరె జిల్లా న్యామతి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యామతి తాలూకా దొడ్డెత్తినహళ్లి గ్రామంలో 32వ సర్వే నంబర్‌లోని నాలుగు ఎకరాల గోమాళ భూమి ఉంది, అందులో అధికారులు ప్రభుత్వ కట్టడాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఆ భూమిని పశువుల మేతకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కట్టడం నిర్మిస్తే జీవాలకు మేత లేకుండాపోతుందని వాపోయారు. గోమాళ భూమిని ఆక్రమించడానికి ప్రభుత్వ అధికారులు కుట్ర చేశారని, తాము ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఆ భూమిని వదిలేసి మరోచోట భవనం కట్టుకోవాలని డిమాండ్ చేశారు.
నీలం కోడి గుడ్డు?
దొడ్డబళ్లాపురం: సాధారణంగా కోడి గుడ్లు తెలుపు, లేదా గోధుమ రంగులో ఉంటాయి. అయితే దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలో సయ్యద్ నూర్ అనే వ్యక్తి ఇంట్లో పెంచుకుంటున్న కోడిపెట్ట నీలం రంగు గుడ్డు పెట్టిందని చెబుతున్నాడు. గుడ్డును పరీక్షించిన పశు సంవర్థక శాఖ అధికారులు.. కోడి ఇదేవిధంగా నీలం రంగు గుడ్లు పెడితే అధ్యయనం చేస్తామన్నారు.
షాపింగ్‌లో గుండెపోటు.. బాలుడు మృతి
మండ్య: పుట్టిన రోజుకోసం కొత్త బట్టలు కొనడానికి కుటుంబంతో షాపింగ్‌కు వచ్చిన బాలుడు గుండెపోటుతో విగతజీవిగా మారాడు. వివరాలు.. మండ్య జిల్లా మద్దూరు తాలూకాలోని డిల్లిగెరె గ్రామానికి చెందిన ఉమేశ్, జయశీల కుటుంబం ప్రస్తుతం బెంగళూరులోని కమలానగరలో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. వారి కుమారుడు ఎం.యు. చిరాగ్‌గౌడ(16), నగరంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. త్వరలో బర్త్‌డే ఉండడంతో బట్టలు కొనడానికి ఓ మాల్‌కు వెళ్లారు. ఆ సమయంలో చిరాగ్ కుప్పకూలిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు దగ్గర్లోని ఎం.ఎస్.రామయ్య ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించాడని చెప్పడంతో కన్నవారు గుండెలవిసేలా రోదించారు.
పట్టాలపై పడిన మెట్రో ఉద్యోగి
శివాజీనగర: రాజధానిలో మెట్రో రైలు పట్టాలపై ఓ సెక్యూరిటీ గార్డు పొరపాటున పడిపోయాడు. రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌లో జరిగింది. మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఉన్న మెట్రో భద్రతా ఉద్యోగి పట్టాల సమీపంలో వెళ్లినపుడు అదుపు తప్పి కిందపడ్డాడు. వెంటనే తోటి సిబ్బంది విద్యుత్ సరఫరాను కట్ చేశారు. పట్టాలకు హైటెన్షన్ విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. వాటిని తాకితే ప్రాణాపాయం సంభవించే అవకాశముంది. ప్రయాణికుడు, మరో గార్డు అతనిని పట్టుకుని రక్షించారు. బాధితుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ గందరగోళంలో ఆ మార్గంలో వస్తున్న ఓ రైలును కొన్ని నిమిషాల సేపు నిలిపివేశారు.

తహసీల్దారు ఆఫీసును గొర్రెలతో ముట్టడి

తహసీల్దారు ఆఫీసును గొర్రెలతో ముట్టడి