
తిమరోడి ఇంట్లో సిట్ సోదాలు
బనశంకరి: ధర్మస్థల వ్యవహారంలో దుష్ప్రచారం కుట్ర చేశారనే కేసులో సిట్ అధికారులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ధర్మస్థల పక్కన ఉండే ఉజిరే గ్రామంలో మహేశ్‌శెట్టి తిమరోడి ఇంటిలో మంగళవారం సోదాలు చేశారు. ఆ ఇంట్లో ముసుగు వ్యక్తి చిన్నయ్య ఉంచిన మొబైల్‌ఫోన్‌తో పాటు కొన్ని ముఖ్య సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. సిట్ విచారణ సమయంలో తన మొబైల్, తిమరోడి ఇంట్లో ఉందని చెప్పాడు. తిమరోడి సోదరుడు మోహన్‌కుమార్ ఇంట్లో చిన్నయ్య ఉండడానికి గది ఇచ్చారు. ఈ సమాచారం సేకరించిన సిట్ అధికారులు తిమరోడి, సోదరుని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. తిమరోడి ఇంటి సీసీటీవీ, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అతని ఇంటికి వచ్చి వెళ్లేవారి వివరాలను సేకరించారు. చిన్నయ్య నిత్యం తిమరోడికి టచ్‌లో ఉండేవాడు, తవ్వకాల ఫోటోలను పంపించేవాడని తేలింది. చిన్నయ్య పుర్రెను తీసుకొచ్చి తిమరోడి ఇంట్లోనే ఉంచాడని, అక్కడే కుట్ర గురించి చర్చించారని తెలిసింది. కాగా, తిమరోడి ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోనే మీడియాను పోలీసులు అడ్డుకున్నారు.
నిజం చెబుతా.. చిన్నయ్య కన్నీరు
అవసరమైతే కోర్టుకు తీసుకెళ్లండి, న్యాయమూర్తి ముందు నిజం చెబుతా, ఈ కేసు నుంచి నన్ను వదిలిపెట్టండి, దయచేసి కాపాడండి అంటూ చిన్నయ్య సిట్ బృందం ముందు కన్నీరుపెట్టాడు. ధర్మస్థలలో ఎన్నో ఘోరాలు జరిగాయని ఇప్పటివరకు రభస చేసిన చిన్నయ్య అరెస్టు కాగానే మెత్తబడ్డాడు. తనకు తెలిసినదంతా చెబుతానని అంగీకరించాడు. దీని వెనకున్న ముఠా గురించి చెప్పాడు, 12 మంది ఉన్నట్లు తెలిపాడని సమాచారం. వందలాది శవాలు పూడ్చిపెట్టానని అబద్ధం చెప్పాను, ఈ కేసు ఇంతపెద్దది అవుతుందని తెలియక ఏదేదో చేశాను అని విలపించినట్లు తెలిసింది.
విచారణకు సుజాత భట్
తన కూతురు అనన్య భట్ అదృశ్యం అయ్యిందని ప్రచారం చేసుకున్న వృద్ధురాలు సుజాత భట్ ఆకస్మాత్తుగా బెళ్తంగడిలో సిట్ విచారణకు హాజరై ఆశ్చర్యపరిచారు. 29వ తేదీ విచారణకు రావాలని ఆమెకు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చారు. కానీ సుజాతభట్ విచారణకు హాజరు కాలేనని చెప్పారు. దీంతో బెంగళూరులో ఆమె ఇంటిలోనే ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇంతలోనే మంగళవారం ఉదయం 5 గంటలకు ఇద్దరు న్యాయవాదులతో కలిసి వచ్చారు. ఆ సమయంలో సిట్ అధికారులు నిద్రపోతున్నారు. వెంటనే మేలుకుని విచారణకు ఏర్పాట్లు చేశారు. మణిపాల్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న కుమార్తె అనన్య భట్ ధర్మస్థలకు వెళ్లినప్పుడు అదృశ్యమైందని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదని తెలిపింది. ప్రశ్నిస్తే తనపైనే కొందరు దాడిచేశారని తెలిపింది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
మొబైల్, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం
ధర్మస్థల కేసులో ముమ్మర విచారణ