
క్యాంటర్ ఢీకొని వ్యక్తి మృతి
హుబ్లీ: క్యాంటర్ ఢీకొని రోడ్డు దాటుతున్న గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన జాతీయ రహదారి– 48లో తింగనళ్లి క్రాస్ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. విజయనగర జిల్లా హూవినహడగలికి చెందిన హొన్నప్ప (46) అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈయనను బెళగావి నుంచి ధార్వాడ వైపునకు వెళుతున్న క్యాంటర్ ఢీకొంది. దీంతో తలకు, చేతికి, కాళ్లకు తీవ్ర గాయాలై హొన్నప్ప మరణించాడు.
బళ్లారివాసులకు గాయాలు
కూడేరు: అనంతపురం వద్ద కూడేరు మండల పరిధిలోని శివరాంపేట సమీపాన అనంతపురం– బళ్లారి ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన భీమలింగ, గోవిందప్పలు గాయపడ్డారు. సోమవారం ద్విచక్ర వాహనంలో ఇద్దరూ అనంతపురం నుంచి బళ్లారికి వెళుతుండగా ఘటనా స్థలికి రాగానే ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా కారు రావడంతో అదుపు తప్పి లారీకి తగలడంతో కింద పడ్డారు. ఓ మోస్తరు గాయాలు కావడంతో ఉరవకొండ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
29న దొడ్డాట ప్రదర్శన
హుబ్లీ: లింగరాజ నగర సముదాయ భవనంలో ఈ నెల 29న సాయంత్రం 6.45 గంటలకు జానపద కళా బళగ ఆధ్వర్యంలో అంగులిమాల దొడ్డాట ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు రమేష్ కరిబసమ్మనవర తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నానాటికీ ఆదరణ తగ్గిపోతున్న కళలను కాపాడుకొని పరిరక్షించే దిశలో అంగులిమాల దొడ్డాట ప్రదర్శనను జానపద విశ్వవిద్యాలయం, లింగరాజ నగర క్షేమాభివృద్ధి సంఘం సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. భాగవతులుగా శేకయ్య గురయ్యనవర, సురేంద్ర ఉల్లంబి, వీరభద్రయ్య తబలా వాదన, చెన్నప్ప మేటి హార్మోనియం, రమేష్ భజంత్రి షహనాయి వాదన ఉంటుందన్నారు. ప్రముఖ కళాకారులు నాటకంలో వివిధ పాత్రల్లో నటిస్తారన్నారు. జానపద వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీఎం భాస్కర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీటీ గురుప్రసాద్, ప్రొఫెసర్ శివశంకర్ పాల్గొంటారన్నారు.
ఓట్ల చౌర్యంపై నిరసన
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఓట్ల చౌర్యంపై న్యాయాంగ విచారణ చేపట్టాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేిసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అజీజ్ మాట్లాడారు. బెంగళూరు లోక్‌సభ పరిధిలో 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అందులో 11 వేలు నకిలీ ఓట్లు, 40 వేల అనుమానాస్పద చిరునామా ఓట్లు, 4 వేల సస్పెన్షన్‌లో ఉంచిన ఓట్లపై న్యాయాంగ విచారణ చేపట్టాలని ఒత్తిడి చేశారు.
అధ్యాపకులను నియమించరా?
రాయచూరు రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులు లేకుండా ప్రారంభించడం తగదని ఏఐడీఎస్‌ఓ పేర్కొంది. సోమవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పాఠాలు బోధించే అధ్యాపకులను నియమించకుండా సర్కార్ నిర్లక్ష్య ధోరణిని విడనాడాలన్నారు. తాత్కాలికంగా అతిథి అధ్యాపకులను నియమించుకొని పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
యువతి అదృశ్యం
హొసపేటె: హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేనహళ్లి గ్రామానికి చెందిన పి.అంజుమ్ సాదియా (20) అనే యువతి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదైంది. ఈ యువతి 5.3 అడుగుల ఎత్తు కలిగి, నలుపు రంగు ప్యాంటు, ఆకు పచ్చ రంగు టాప్ ధరించి, కన్నడ, హిందీలో మాట్లాడగలదని, ఈమె ఆచూకీ గురించి ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ కంట్రోల్ రూం లేదా 94808057700 నంబరుకు సమాచారం అందించాలని సబ్‌ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉన్నత విద్యతో అందలం
రాయచూరు రూరల్: ఉన్నత విద్యకు ప్రోత్సాహం కల్పించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందరింలో చలువాది సమాజం ద్వారా ప్రతిభా పురస్కారాలను అందించి మాట్లాడారు. ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్తులో జిల్లాకు మంచిపేరు తెచ్చి సమాజ సేవకు పాటుపడాలన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, చలువాది సమాజం అధ్యక్షురాలు అర్చన, జయన్న, రామప్ప, రుద్రప్ప, శాలం, దొడ్డ బసవరాజ్‌లున్నారు.

క్యాంటర్ ఢీకొని వ్యక్తి మృతి

క్యాంటర్ ఢీకొని వ్యక్తి మృతి

క్యాంటర్ ఢీకొని వ్యక్తి మృతి