
తండ్రి అధికార దుర్వినియోగం తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సేవ చేయడానికి మంత్రి పదవినిస్తే కుమారుడు దుర్వినియోగపరచడం తదగని బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లాధ్యక్షుడు సన్నీ ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు కుమారుడు రవి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను నానా విధాలుగా బెదిరిస్తూ తనకు ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు బనాయించి సరిహద్దు బహిష్కరించే స్థాయికి దిగజారడాన్ని ఖండించారు. చిన్న విషయాలకు నగరసభ, జిల్లాధికారి, ఎస్పీ, పోలీసులు రవి వెంట రావడం చూస్తే తండ్రి మంత్రా? లేక కొడుకు మంత్రా? అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. ప్రజా సేవ చేయాల్సిన అధికారులు మంత్రి సుపుత్రుడు రవికి సెల్యూట్ చేయడం అపహాస్యంగా ఉందన్నారు. తనపై కేసులు లేకున్నా అసిస్టెంట్ కమిషనర్‌తో సరిహద్దు బహిష్కరణ చేయించారన్నారు. ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతుంటే అధికారులు రవి చుట్టూ ప్రదక్షణలు చేయడాన్ని ఖండించారు. అధికారులు ప్రజలకు సేవకులా? లేక మంత్రి పుత్రుడు రవికి సేవకులా? అనే ప్రశ్న ఉదయిస్తోందన్నారు. అదికారులు మంత్రి పుత్రుడు రవికి వంత పాడడం మానుకోవాలని అన్నారు.