
రక్తదానం మహాదానం
రాయచూరు రూరల్ : రక్తదానం మహాదానం అని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. ఆయన ఆదివారం నగరంలోని వీరాంజనేయ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన మూడో రోజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల నలుగురికి ఉపయోగపడుతుందన్నారు. రక్తం ఇవ్వడం వల్ల మానవుడి దేహంలో కొత్త రక్తం పుడుతుందన్నారు. ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, జయన్న, రుద్రప్ప, అమరేగౌడ, రాజశేఖర్, గురుస్వామి, డాక్టర్ శ్యామణ్ణ, వెంకటేష్ నాయక్, లక్ష్మీకాంతరెడ్డి, గిరీష్, రాజేంద్ర, నీలోఫర్‌లున్నారు.
యువత రక్తదానం చేయాలి
హొసపేటె: ప్రపంచ సోదర దినోత్సవంలో భాగంగా నగరంలోని బసవన్న కాలువ సమీపంలోని బ్రహ్మకుమారీల ఆడిటోరియంలో 30 మంది రక్తదానం చేశారు. 100 మందికి పైగా రక్తదానం చేయడానికి వచ్చారు. వివిధ పరీక్షలు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించిన తర్వాత 30 మంది రక్తదానం చేయడానికి అర్హులుగా తేలింది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సమన్వయకర్త మానస అక్క మాట్లాడుతూ రక్తదానం చేసిన వారిలో ఎక్కువ మంది మొదటిసారి రక్తదానం చేస్తున్నారన్నారు. నేటి యువత రక్తదానానికి ముందుకు రావాలన్నారు. పతంజలి యోగా సమితి యువ భారత్ రాష్ట్ర ఇన్‌చార్జి కిరణ్‌కుమార్, రెడ్‌క్రాస్ సొసైటీ అన్నపూర్ణ సదాశివ, టీబీ డ్యాం స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ గౌస్, ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ ఐశ్వర్య పాల్గొన్నారు.