
పర్యావరణ మిత్రలకు అవార్డులు
● హుబ్లీ–ధార్వాడ మహానగర పాలికె నిర్ణయం
హుబ్లీ: మరి కొన్ని గంటల్లో చిన్న, పెద్ద అందరూ భక్తిశ్రద్ధలతో ముచ్చటగా జరుపుకొనే వినాయక చవితి వేడుకలకు జంట నగరాలతో పాటు జిల్లాలో సంబంధిత వినాయక మండలి నిర్వాహకులు మండపాల ఏర్పాటు, ఇతర పనులలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో జంట నగరాల పాలికె పర్యావరణాన్ని ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ప్రకృతి గణేషోత్సవ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మట్టి గణపతి మూర్తులను ప్రతిష్టాపించే లక్ష మందికి డిజిటల్ ప్రమాణపత్రం పంపిణీ, ప్లాస్టిక్ వాడకుండా గణపతి మంటపాలను అలంకరించే పోటీలను ఏర్పాటు చేసి 10 మందికి ప్రశస్తులను ఇవ్వాలని తీర్మానించింది. ఆ మేరకు ప్రజలు మట్టి గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసిన రసీదు చూపాలి. పునర్వినియోగ ప్లాస్టిక్, ఇతర నైసర్గిక వస్తువులతో మంటపాలను ఆకర్షణీయంగా అలంకరించడం, పర్యావరణ స్నేహిగా ఇంటి ఆవరణలోనే విగ్రహాలను నిమజ్జనం చేయడం, ఆ మట్టిలో మొక్కలు నాటే 10 మందికి అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రజల్లో చైతన్య కల్పనే ధ్యేయం
పండుగలు, పబ్బాల వేళ జంట నగరాల్లో చెత్త ఉత్పత్తి ప్రమాణం పెరుగుతూనే ఉంది. చెత్త ఉత్పత్తిని నివారించడం, ప్లాస్టిక్ రహిత నగరం, పర్యావరణ స్నేహి గణేష్ పండుగను ఆచరించాలని ప్రజల్లో చైతన్యం కలిగించడమే ఈ వినూత్న అభియాన్ ఉద్దేశం. పాలికె మేయర్ జ్యోతి పాటిల్ ఈ విషయమై స్పందిస్తూ మట్టి గణపతులతో వేడుకలను జరుపుకోవాలని విశేషంగా జాగృతి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. పర్యావరణ స్నేహి గణేష్ మూర్తికి ఉత్తేజం ఇవ్వడానికి ప్రకృతి గణేశోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జంట నగరాల ప్రజలు పర్యావరణానికి అనుకూలంగా ఏర్పాట్లు చేసుకొని దుష్పరిణామాలను కలిగించే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లక్ష మందికి అవార్డులను ప్రదానం చేస్తామని, దీని కోసం నమోదుకు ఈ నెల 25 తర్వాత వెబ్ సైట్‌లో ప్రజలకు నమోదు అవకాశం కల్పిస్తామన్నారు. పోస్టర్లు, కర పత్రాలు, వివిధ పోటీల ద్వారా పర్యావరణ వినాయక సవాల్ వేడుకల నిర్వహణకు ఎంతో భక్తిశ్రద్ధలతో సంబంధిత అధికార సిబ్బంది కృషి చేస్తారన్నారు.