
భారీ వర్షాలు.. కూలిన కొండచరియలు
● హాసన్ జిల్లాలో సంఘటన
● బెంగళూరు– మంగళూరు మార్గంలో రైళ్లు బంద్
యశవంతపుర: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం, రుతు పవనాల వల్ల హాసన్ జిల్లావ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. సకలేశపుర సమీపంలోని ఎడకుమారి వద్ద రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడ్డాయి. దీనితో బెంగళూరు– మంగళూరు మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. మంగళూరు నుంచి విజయవాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును బంట్వాళలో నిలిపేశారు. విపరీతమైన వానలు కొనసాగే అవకాశం ఉన్న కారణంగా మట్టి చరియలను తొలగించిన తరువాత రైళ్ల సంచారానికి అనుమతిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికల్లా సుగమం చేస్తామని చెప్పారు.
శిరాడి ఘాట్‌లో తీవ్ర ఇబ్బందులు
బెంగళూరు – మంగళూరును కలిపే శిరాడిఘాట్ మార్గంలో కుండపోత వర్షాల వల్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. మారనహళ్లి వద్ద మట్టి చరియలతో పాటు చెట్లు కూలిపోయాయి. వాహనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వారాంతం కావటంతో శిరాడి, సకలేశపుర, మంగళూరు మార్గం స్థానికులు, టూరిస్టుల వాహనాలతో నిండిపోయింది. రెండు వైపుల నుంచి వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చెట్లు, మట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. చలిలో వర్షాలకు వాహనదారులు తడిసిపోయారు. తాము చెప్పేవరకు వాహనాలను కదిలించవద్దని అధికారులు తెలిపారు.
జిల్లాల్లో వర్షాలు
వివిధ జిల్లాల పరిధిలో భారీగా వానలు పడుతున్నాయి. బెంగళూరులో ఆకాశం మేఘావృతమై అప్పుడప్పులు జల్లులు పడుతున్నాయి. చలి తీవ్రత పెరిగింది. ప్రజలు గొడుగులు పట్టుకుని బయటకు వచ్చారు. శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కర్ణాటకలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి జిల్లాలో నదులు, జలపాతాలు జోరందుకున్నాయి.
కావేరి నది పరవళ్లు
మండ్య: మండ్య జిల్లాలో ఉన్న కావేరి జలాశయం ఎగువన భారీ వర్షాలు పడుతుండటంతో నది ఉరకలు వేస్తోంది. కృష్ణరాజసాగర జలాశయంలోకి వరదనీరు వెల్లువెత్తుతోంది. ఆదివారం డ్యాం నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలివేశారు. నది ప్రవాహం ఉధృతంగా మారింది. ముందుజాగ్రత్తగా నది పరిసరాల్లోకి ప్రజలు, పశువులు రాకూడదనని, లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రకటించారు. డ్యాం దాదాపుగా నిండిపోయింది.

భారీ వర్షాలు.. కూలిన కొండచరియలు